తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తిరుక్కురుంగుడి ఉంది. కన్యాకుమారికి ఉత్తరాన 40 కి.మీ .దూరంలో, తిరువనంతపురంకు 120 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న నంబిరాయర్ దేవాలయానికి 1300 ఏళ్ళ చరిత్ర ఉంది. వరాహపురాణం, బ్రహ్మాండ పురాణంలో ఈ దేవాలయం ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద వీధులు కనిపిస్తాయి. చుట్టూ వీధులు, మధ్యలో కోటలాంటి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని క్రమబద్ధంగా నిర్మించిన తీరు మనలను ఆకర్షిస్తుంది. ఇక్కడ కొలువైన స్వామి వారిని తిరుమళిశైపిరాన్, నమ్మాళ్వార్, పేయాళ్వార్, తిరుమంగై ఆళ్వారులు మంగళాశాసనములు చేశారు. ఇక్కడ ఉన్న శిల్పాలు ఆశ్చర్యపరిచేలా కనిపిస్తాయి. 108 దివ్య దేశాల్లో ఇది విశిష్టమైనదని అంటారు. ఇక్కడ ఐదు ఆలయాలు మనకు కనిపిస్తాయి. నిన్డ్ర నంబి (నిలిచి ఉన్న భంగిమలో ఉన్న స్వామి), ఇరుంద నంబి (కూర్చుని ఉన్న స్వామి), కిదంద నంబి (నిద్రపోతున్న భంగిమలో స్వామి), తిరుపార్కడల్ నంబి, తిరుమలై నంబి పేరుతో ఇక్కడ ఆలయాలు ఉన్నాయి. తిరుపార్కడల్ నంబి ఆలయం ప్రధాన ఆలయానికి 3 కి.మీ దూరంలో ఉన్న నంబియారు నది వద్ద ఉంది. తిరుమలై నంబి ఆలయం మాత్రం ప్రధాన ఆలయానికి 8 కి.మీ. దూరంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై నెలకొని ఉంది. ఇక్కడే మరో విశేషం ఉంది. బద్రీలో కొలువైన శ్రీమన్నారాయణునికి శ్రీరామానుజులవారు ఎంతో పరిచర్యలు చేయడంతో స్వామివారు సంతృప్తి చెంది ఉపదేశం చేశారు. ఇదే శ్రీమన్నారాయణుడు తిరుక్కురుంగుడిలో శ్రీరామానుజులకు శిష్యునిగా ఉంటూ వైష్ణవ దీక్షను పొందారన్నది ఐతిహ్యం.
కైశిక ఏకాదశి…
ఇక్కడి ఆలయంలో కార్తీకమాసం శుక్లపక్షం ఏకాదశి రోజు జరిగే ఉత్సవాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఆ రోజున కైశిక ఏకాదశి ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా నృత్యరూపకాన్ని ప్రదర్శిస్తారు. ఆళగియనంబి పేరుతో పిలిచే ఉత్సవ విగ్రహాలను మంటపంలోకి తీసుకు వచ్చిన తరువాత ఈ నృత్య రూపకాన్ని స్వామివారి ఎదుట ప్రదర్శిస్తారు. ఈ కైశిక ఏకాదశి వృత్తాంతం మనకు వరాహపురాణంలో కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువు మూడవ అవతారం వరాహ అవతారం. ఈ పురాణాలు మనకు వేదాల నుంచి లభించింది. వేదము పరబ్రహ్మ స్వరూపం. వేదాంత సారం గ్రహించుట చాలా కష్టము. మహర్షులు ఎంతో తపస్సు చేసి ఈ వేదాలలోని సారాంశాన్ని గ్రహించి మనకు అందజేశారు. స్మృతిరూపంలో వారు అందించిన సారాంశముఇ తిహాసాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఇతిహాసాలే భారతము, రామాయణ గ్రంధాలు. యధార్థమైన గాధలతో రచించిన భారతం, రామాయణాల నుంచి వచ్చినవే పురాణాలు. ఈ పురాణాల్లో విష్ణుపురాణం, మార్కండేయ పురాణము, గరుడ పురాణము, కైశిక పురాణము మొదలుగునవి ఉన్నాయి. ఈ పురాణాల నుంచి ఉపపురాణాలు వెలువడ్డాయి. వరాహపురాణము నుండి వచ్చినదే సాత్విక పురాణము. వరాహ పురాణములో కైశిక ఏకాదశి ప్రాముఖ్యత కలదు. ఒక నమ్పాడువాన్ అను భక్తునివలన ఒక బ్రహ్మరాక్షసునకు మోక్షము ఎలాగలిగిన్నదన్నదే ఈ కైకిక ఏకాదశి వృత్తాంతము.
నమ్పాడువాన్ ఒక దళిత వంశమున జన్మించిన పరమభక్తుడు, కైశిక ఏకాదశి వ్రతాన్నిఆచరించి, భక్తి పారవశ్యంతో దేవుణ్ని కీర్తిస్తూ, తిరుక్కురుంగుడిలో అళగియనంబి స్వామి సన్నిధిలో తన వ్రత దీక్షను ముగించి ద్వాదశి పారాయణ చేయాలనుకున్నారు. అళగియ నంబి స్వామిని దర్శించేందుకు అరణ్య మార్గంగుండా వస్తుండగా, మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసి ఎదురైంది. తనకు ఆకలిగా ఉందని నిన్ను తింటానని చెప్పడంతో నమ్పాడువాన్ తాను వ్రతం చేస్తున్నానని, ఈ వ్రతాన్ని ముగించుకుని వచ్చి నీకు ఆహారమవుతానని చెబుతారు. కాని బ్రహ్మరాక్షసి ఒప్పుకోలేదు. ఎలా నమ్మాలంటూ చెప్పింది. చివరకు తాను మాట తప్పితే అన్నీ పాపాలు తనకే చుట్టుకుంటాయని చెప్పడంతో చివరకు బ్రహ్మరాక్షసి అనుమతిచ్చింది. చెప్పినట్లుగానే నమ్పాడువాన్ స్వామిని కైశిక రాగంలో కీర్తించి బ్రహ్మరాక్షసి దగ్గరకు వచ్చాడు. బ్రహ్మరాక్షసి అతని నిజాయితీకి మెచ్చి తనకు నిన్ను తినాలని లేదని, కాకపోతే తనకు నీవు పొందిన పుణ్యంలో నుంచి పావువుంతు అయినా తనకు ఇవ్వాలని కోరుతుంది. దానికి తొలుత ఒప్పుకోని నమ్పాడువాన్ చివరకు పావువంతు పుణ్యాన్నిఇస్తున్నట్లు చెప్పిన వెంటనే బ్రహ్మారాక్షసి మాయమైపోయింది. ఆ స్థానంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ప్రత్యక్షమై తాను యాగం చేస్తున్నప్పుడు చేసిన పొరబాట్ల వల్ల తాను బ్రహ్మరాక్షసి అయ్యానని తనకు ఇప్పుడు పాప విమోచనం అయిందని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ వరాహపురాణంలో కనిపిస్తుంది. ఇదే కైశిక మహత్యంగా కూడా చెబుతారు. శుక్లపక్ష కార్తిక మాసంలో ఏకాదశి రోజున ఈసంఘటన జరిగినందువల్ల ఆ రోజును కైశిక ఏకాదశిగా పేర్కొంటున్నారు. వరాహ పురాణంలో ఈ కథ ఉంది. భూమాదేవి తన కుమారులకు మోక్షం రావాలంటే ఏమి చేయాలని వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువును కోరినప్పుడు, ఈ కైశిక పురాణాన్నిప్రత్యక్షంగా తిలకించిన వారికి, విన్నవారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. అన్నీ దేవాలయాల్లో కైశిక ఏకాదశి రోజు కైశిక పురాణాన్ని చదువుతారు. కానీ తిరుక్కురుంగుడిలో మాత్రం ప్రత్యక్షంగా నాటకరూపంలోప్రదర్శిస్తారు. నమ్పాడువాన్ వంశీయులే ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కైశిక పురాణాన్నిప్రత్యక్షంగా తిలకించేందుకు ఎంతో మంది భక్తులు ఈ దేవాలయానికి దేశ, విదేశాలనుంచి తరలివస్తారు. దాదాపు 5 గంటల పాటు రాత్రి 9. 30 నుంచి తెల్లవారు జామువరకు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటకంలోబ్రహ్మరాక్షసుని పాత్ర పోషించే వ్యక్తి దాదాపు 41 రోజుల పాటు వ్రతాన్ని ఆచరించి దేవాలయంలోనే బస చేస్తారు. రాక్షస వేషధారణతో అతను స్వామివారికి పూజలుచేస్తాడు. కైశిక ఏకాదశి రోజు అతను పూజలుచేసి తన వ్రతాన్ని విరమిస్తాడు. వ్రతదీక్ష విరమణ సమయంలో ఆ బ్రహ్మరాక్షసి లాగా అతని ఆవేశం, హింస, దూకడం వంటివి ప్రత్యక్షంగా చూడాల్సిందే. తరువాత ఆళగియ నంబి స్వామివారి ముందు మోకరిల్లి స్వామి తీర్థం తీసుకున్న తరువాతనే అతను ప్రశాంతమవుతాడు.
ఈ పురాణము వలన ఈ ప్రదేశమునకు ఎంతో పేరు వచ్చింది. ఈ నృత్య రూపకము రాత్రి సగం జామువారకు చూసి స్నానం చేసిన తరువాత ఆలయంలో కొలువైన మూల విరాట్టులను భక్తులు దర్శిస్తారు. ఐదుగురు నంబిలు కొబ్బరి చెట్టు రూపంలో తిరుమంగై ఆళ్వార్‌కు మోక్షం ఇచ్చినట్లు స్థల పురాణం ఉంది.
నేను ఈ ప్రాంతాన్ని కైశిక ఏకాదశి రోజున సందర్శించేలా చేసిన శ్రీమాన్ శ్రీనివాసన్ గారికి ధన్యవాదాలు. ఆయనకు తెలియని విషయం లేదు. సంస్కృత భాషలో పిహెచ్డి చేసి సెంట్రల్స్కూల్లో టీచర్‌గా ఉన్నారు. ఆయన శ్రీమతి కూడా హిందీలో పిహెచ్డి చేసి టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరిది ఇదే స్వస్థలం కావడంవల్ల మమ్ములను వారు ఆదరించి ఆతిధ్యం ఇచ్చినందులకు మరోసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మా అక్క మధుర, అల్లుడు డాక్టర్ మోహన్, శ్రీమతి లత ఈ ప్రాంతాన్నిసందర్శించాల్సిందిగా నన్నుఆహ్వానించారు. వారి ఆహ్వానంవల్లనే నేను ఈప్రాంతాన్ని ఈ పుణ్యప్రదమైన రోజున చూడగలిగాను.
– విమలారంగాచారి హైదరాబాద్