మన సంప్రదాయం ఎంతో గొప్పదని ఆ సంప్రదాయాన్ని నిలిపేందుకు అహర్నిశలు పాటుపడిన శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ స్వామి భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన తయారు చేసిన శిష్యులు మాత్రం ఆయన మార్గాన్ని విడవక తిరుమల, తిరుపతిలో వడగలై సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారు.
కంభరాజపురంలో జననం...
తమిళనాడులోని కాంచీపురంకు సమీపంలో కంభరాజపురం అనే ఊరిలో జన్మించిన శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ విద్యాభ్యాసం నిమిత్తం తిరుపతి క్షేత్రానికి వచ్చారు. శ్రీ యామునాచార్యులు నెలకొల్పిన పాఠశాలలో ప్రబంధ అధ్యయనం చేశారు. ఆయనతోపాటు టిఎ గోపాలాచార్యులు, టిఎ కృష్ణమాచార్యులు కూడా ఇక్కడే ప్రబంధం నేర్చుకుని ఆయనకు సహచరులుగా పేరు పొందారు. అప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్‌గా డిటి తాతాచార్యులు వ్యవహరించారు. నేడు పెద్దజీయంగార్‌గా ఉన్న రంగరామానుజ జీయర్ కూడా ఈ పాఠశాలలోనే ప్రబంధాన్ని అధ్యయనం చేశారు.
పంచమవేదంగా ప్రసిద్ధిపొందిన దివ్యప్రబంధాన్ని అధ్యయనం చేయడంతోపాటు ఆ ప్రబంధం గానాన్ని వినడం వల్ల, పఠించడం వల్ల కలిగే మేలును పలువురికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో, తిరుపతి తిరుమలలో దేవదేవుల చెంత శ్రీ వేదాంతదేశికుల సంప్రదాయం వినిపించాలన్న లక్ష్యంతో దివ్య ప్రబంధాన్ని పలువురికి నేర్పించాలని ఆయన అనుకున్నారు. అందుకు ముఖ్యకారణం ఆరోజుల్లో వడగలై తిరునామం ధరించిన ప్రబంధగోష్టి చేసేవాళ్ళు లేరు. ఆయన ఒక్కరే వడగలై నామం వేసుకుని ప్రబంధ పారాయణ చేసేవారు. దాంతో ఈ వడగలై సంప్రదాయాన్ని నిలబెట్టాలన్న సత్‌సంకల్పంతో ఎంతోమందికి ప్రబంధాన్ని నేర్పించడం ప్రారంభించారు. చిన్న పిల్లలకు, పెద్దలకు ఆ దివ్య ప్రబంధాన్ని నేర్పించడం చేశారు. ఆయన దగ్గర ప్రబంధాన్ని నేర్చుకున్న శిష్యులు నేడు దివ్యక్షేత్రం తిరుపతిలో ప్రబంధపారాయణంలో వడగలై ప్రాముఖ్యతను అందరూ గుర్తించేలా చేశారు.
విష్ణువును కీర్తిస్తూ పాడిన పాశురాలే దివ్య ప్రబంధాలు
వైష్ణవులకు శ్రీమన్నారాయణుడే ముఖ్యం. ఆయనే సర్వానికి మూలమని నమ్ముతారు. అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాస్యనారాయణ స్థితః అంటే సకలలోకాల్లో జరిగే క్రియకు ఆయనే మూలకారకుడని చెబుతారు. త్రిమూర్తులు అతని అంశతోనే ఆవిర్భవించారని అంటారు. శ్రీమన్నారాయణుని ఆరాధన విధానాన్ని దాని ఫలితాన్ని విష్ణుదేవుడే స్వయంగా లక్ష్మీదేవికి బోధించారని ఐతిహ్యం. ఈ విషయాన్ని లక్ష్మీదేవి విష్వక్సేనులకు చెప్పగా, విష్వక్సేనులవారు నమ్మాళ్వార్‌కు దీనిని బోధించారు. నమ్మాళ్వార్ దీనిని శ్రీనాధమునికి తెలియజేశారు. నాధముని దగ్గర నుంచి క్రమంగా వైష్ణవాచార్య పరంపరకు ఇది లభించింది. ఈ పరంపరంలో నాధముని తరువాత యామునాచార్యులు (ఆళవందార్)ను పేర్కొంటారు. ఆయన తరువాత పేర్కొనదగ్గవారు శ్రీ రామానుజులవారు. వీరు వైష్ణవ వ్యాప్తికి ఎనలేని సేవ చేశారు. అచారవ్యవహారాలను ఏర్పరిచారు. శ్రీమన్నారాయణుని శరణు పొందాలంటే దివ్య ప్రబంధ గానమే ఉత్తమమని 12 మంది ఆళ్వారులు తెలియజేశారు. పొయ్‌గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ ఈ ఆళ్వారులు తమ మధురగానంతో పాశురాలను పాడి పరమ్మాతునిలో ఐక్యమయ్యారు. వారు పాడిన పాశురాలనే దివ్య ప్రబంధాలుగా పేర్కొంటారు. వేదాల్లో ఐదవ వేదంగా ఈ ప్రబంధాలు పేరుగాంచాయి.
ఆళ్వారులు పాడిన పాశురాలను శ్రీ వైష్ణవ దేవాలయాల్లో నిత్యం పారాయణ చేస్తారు. బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి ముందు జీయంగార్ ఆధ్వర్యంలో ఈ ప్రబంధాన్ని పఠిస్తారు. అలాంటి మధురమైన, భక్తిని పెంచే దివ్య ప్రబంధాన్ని పదిమందికి నేర్పించాలన్న తపనతో శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ తన ఇంట్లోనే తన నిత్యకార్యక్రమాలను చేసుకుంటూ చిన్నారులకు, పెద్దలకు ప్రబంధాన్ని నేర్పించారు.
ఆయన దగ్గర శిష్యులుగా ప్రబంధాన్ని శ్రీమాన్ పాదూర్ రంగరాజన్ స్వామి, శ్రీమాన్ ప్రణాతార్థిహరవరదాచార్ స్వామి, శ్రీమాన్ పయవేరి రామానుజాచార్య స్వామి, కె. పార్థసారథి స్వామి, వాద్యార్ నారాయణ స్వామి, తామరపు రంగరాజన్ స్వామి, కంభరాజపురం శేషాద్రి (మురళి) స్వామి, కంభరాజపురం శ్రీనివాస రాఘవన్ స్వామి (సంపత్), పి.ఎం. ముకుందరాజన్ స్వామి, వి.ఆర్ శ్రీనివాసన్ స్వామి, వి.ఎన్. రాజగోపాలన్ స్వామి, విఎన్. మురళీ స్వామి, మాలోల నరసింహన్ స్వామి, కూత్తపాక్కం రంగనాథన్ స్వామి, తట్టై శ్రీనివాసన్ స్వామి, బి.టి. సతీష్ స్వామి, తట్టై గోవిందరాజన్ స్వామి, కె.వి. రంగరామానుజం స్వామి, ఎం.వి. వరదరాజన్ స్వామి, ఎం.ఆర్. రవి స్వామి ఈయన దగ్గర శిష్యులుగా చేరి దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేశారు.
ఇందులో శ్రీనివాసన్, రంగనాథన్, సతీష్, గోవిందరాజన్, రంగరామానుజం 2వ తరగతి, 3వ తరగతులు చదువుకుంటున్నప్పుడే ప్రబంధాన్ని నేర్చుకునేందుకు గురువు దగ్గర చేరారు. ఆ చిన్నవయస్సులోనే వారిని ప్రబంధం నేర్చుకునేందుకు పంపించిన తల్లితండ్రులను ఆయన ప్రశంసిస్తూ, వారికి ఈ దివ్యప్రబంధం వచ్చిందంటే అందుకు ఆళ్వారుల అనుగ్రహంతోపాటు, భగవంతుని కరుణాకటాక్షమే కారణమని చెప్పేవారు. ఈ ప్రబంధ పారాయణ వల్ల వారు ఉన్నత జీవితాన్ని గడుపుతారని ఆయన చెప్పిన మాట నిజమైంది. ఈ శిష్యుల్లో సతీష్ అమెరికాలోనూ, గోవిందరాజన్ హైదరాబాద్‌లోనూ, శ్రీనివాసన్ చెన్నైలోనూ, రంగనాథన్ తిరుపతిలోనూ, రంగరామానుజం చెన్నైలో ఉద్యోగం లభించడంతో అక్కడే ఉంటున్నారు. సమయం దొరికినప్పుడు భగవంతుని సేవా గోష్టిలో పాల్గొంటున్నారు. ఎక్కడ ఉన్నా తిరుమల బ్రహ్మోత్సవాల్లో వీలైనప్పుడంతా పాల్గొని సేవాకాలం చేయాలన్నదే ఆయన కోరిక. అందుకు తగ్గట్టుగానే శిష్యులు సమయం దొరికినప్పుడు దేవదేవుని గోష్టిలో పాల్గొంటున్నారు.
శిష్యవాత్సల్యం
ఆయన శిష్యవాత్సల్యం ఎలాంటిదంటే తన దగ్గర నేర్చుకుంటున్న చిన్నారులను తన పిల్లలుగా భావించేవారు. పాశురాలను నేర్పించడంతోపాటు వారికి వేడిగా పాలు, స్వీట్‌లను ఇచ్చేవారు. దాంతోపాటు నెలనెలా కొంత డబ్బును కూడా పారితోషికంగా ఇచ్చేవారు. తన దగ్గర నేర్చుకున్న శిష్యులను బ్రహోత్సవాలు ఇతర సమయాల్లో పారాయణం చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు వారిని సొంత బిడ్డలాగానే చూసుకునేవారు. వారికి అవసరమైన వసతి, భోజనం సరిగా అందిందా లేదా చూసేవారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో ఈ శిష్యులంతా అహోబిలమఠంలో పదిరోజులు ఉండి దేవదేవునిముందు దివ్యప్రబంధాన్ని గానం చేసేవాళ్ళు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవాళ్ళకు శిష్యులకు అన్నీ సరిగా అందిందా లేదా అని చూసుకునేవారు.
భగవత్ సేవా కైంకర్యం కూడా అనుగ్రహమే…
తన శిష్యులు నాలుగువేల దివ్యప్రబంధాన్ని నేర్చుకున్న తరువాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దివ్య ప్రబంధాలు అందరికీ రావు. అది భగవంతుని అనుగ్రహం ఉంటేవే వస్తుందని చెప్పేవారు.
సంప్రదాయ పరంపరను కొనసాగిస్తున్న శిష్యులు
శ్రీ వైష్ణవుల్లో తెంగలై, వడగలై అనే సంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉంటారు. తిరుపతిలోనూ, ఇతర క్షేత్రాల్లోనూ గతంలో ఉన్నంతగా వడగలై సంప్రదాయాన్ని నిలబెట్టే వాళ్ళు తక్కువై పోవడంతో శేషాద్రి అయ్యంగార్ స్వామి ఎలాగైన వడగలై సంప్రదాయాన్ని తిరుపతి వంటి దివ్య క్షేత్రంలో నిలబెట్లాన్న తపనతో ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. తాను నేర్పించినవాళ్ళు గోష్టిలో గానం చేస్తుంటే పులకించిపోయేవారు. గురువుగారు వడగలై సంప్రదాయానికి పాటుపడినట్లే ఆయన శిష్యులు కూడా తమవంతుగా సంప్రదాయ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. శ్రీ చక్రవర్తి రంగనాథన్, శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి (మురళీ), అమెరికాలో ఉంటున్న శ్రీ సతీష్‌తోపాటు ఇతరులు కూడా పిల్లలకు, పెద్దలకు ప్రబంధాన్ని నేర్పించి గురువుగారి లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారు. శ్రీ రంగనాధన్ వివిధ క్షేత్రాల్లో దివ్య ప్రబంధంపై ఉపన్యాసాలను కూడా చేస్తూ గురువుగారి పేరును ఇతరచోట్లకు వ్యాపింపజేస్తున్నారు.
–తట్టై గోవిందరాజన్
హైదరాబాద్