Paramparaa – The Tradition Continues…

పాదుకా సేవకులు … కవితార్కిక సింహులు

‘నభస్యమాసి శ్రోణాయాం అనంతార్య గురూద్భవమ్‌।

శ్రీ వేంకటేశ ఘంటాంశం వేదాంతగురుమాశ్రయే ॥

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుని దివ్యఘంటావతారంగా అనంత సూరి సుతునిగా ప్రసిద్ధిగాంచిన వేదాంత దేశికులను నేను ఆశ్రయిస్తున్నాను.’

వేంకటేశావతారోయం తత్‌ఘంటాంశోథవాభవేత్‌।

యతీంద్రాంశోధవేత్యేవం వితర్క్యాయాస్తుమంగళం॥

శ్రీ దేశిక తనయ కుమారవరదాచార్యుల శ్రీసూక్త్యనుసారం ‘శ్రీ వేంకటేశ్వరులు, ఆయన ఘంట మరియు భగవత్‌ రామానుజులు’ ఈ మువ్వురి అవతారమే వేదాంతదేశికావతారం అని సుస్పష్టంగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ సుప్రభాత రచయిత, శ్రీవేదాంతదేశికుల నుండి ‘ప్రతివాదిభయంకర’ అనే బిరుదును స్వీకరించిన ప్రతివాది భయంకరం అణ్ణ న్‌ స్వామి తన ‘సప్తతి రత్నమాలిక’ అనే స్తోత్రములో

భాద్రపదమాసగతవిష్ణువిమలరక్షే

వేంకటమహీధ్రపతి తీర్థదినభూతే ।

ప్రాదురభవత్‌ జగతిదైత్యరిపు ఘంటా

హంత కవితార్కిక మృగేంద్ర గురుమూర్త్యా ॥

ఆహా! దేవదేవుని దివ్యతీర్థవారి రోజు భాద్రపదమాసం, శ్రవణానక్షత్రమున పరమత నిరసనకు సమర్థమైన ఘంట కవితార్కిక సింహ గురుమూర్తిగా అవతరించినది కదా! ఆశ్చర్యం ఆశ్చర్యం అని పేర్కొన్నారు.

ఇలా వేదాంత దేశికుల వారి అవతార విషయాన్ని వారి శిష్యులు పేర్కొనడం ఒక ఎత్తయితే, మరొక ఎత్తు సాక్షాత్తు వేదాంతదేశికులవారే తను రచించిన ‘సంకల్ప సూర్యోదయం’ అనే నాటకంలో

‘ఉత్‌ప్రేక్ష్యతే బుధజనైరుపపత్తిభూమ్నా

ఘంటాహరే స్సమజనిష్ట యదాత్మనేతి।’

అని అంటూ బుధజనులు తనను శ్రీహరి ఘంటాస్వరూపంగా భావించారని దేశికులవారు అన్నారు.

వీరు హయగ్రీవ కృపాకటాక్షలబ్ద పాండిత్యం కలవారుగా ప్రసిద్ధిపొందినా, సంపూర్ణ ఆచార్య అనుగ్రహమే వీరిని గొప్ప దార్శనికునిగా చేసిందని గురుపరంపరా ప్రభావం అనే గ్రంథం తెలియజేస్తోంది.

‘పద్మాధాత్రీ కరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం’ అని శ్రీరంగనాథుని దివ్యమంగళ విగ్రహ సందర్శనజనిత పులకిత తనువులైన శ్రీ వేదాంత దేశికుల పాండిత్య ప్రతిభను తెలుసుకున్న ఓ పండితుడు ఆయనను ఎలాగైనా ఓడిరచాలని కంకణం కట్టుకుని ఆయన దగ్గరకు వచ్చారు. నీవు కవితార్కిక సింహం అని నిరూపించుకోవాలంటే శ్రీరంగనాథుని మీద ఒకే ఒక రాత్రిలో వేయి శ్లోకాలను రచించి చూపించమన్నారు. అప్పుడు దేశికులవారు ఎంతో వినమ్రతతో ‘‘స్వామీ! నాకు పోటీపడాలన్న ఉద్దేశ్యం లేదు. అందువల్ల నాకు ఈ బిరుదు వద్దు, కావాల్సివస్తే మీరే పెట్టుకోండని’’ చెప్పారు. తనకు భగవత్‌ కైంకర్యమే ముఖ్యమని విన్నవించారు. ఈ మాటలను విన్న ఆ పండితుడు కొంత ఇబ్బందిపడుతూనే, పోటీపడాల్సిందేనంటూ ‘నేను దేవదేవుని దివ్యపాదారవిందములమీద వేయి శ్లోకాలను వ్రాస్తాను. మీరు కూడా ఈ రాత్రిలోపల వేయి శ్లోకాలను రచించి చూపించమని పోటీకి మరోసారి ఆహ్వానించారు. పోటీయే వద్దని అనుకుంటున్న శ్రీ వేదాంత దేశికులవారి శిరస్సు మీద అర్చకోత్తములు శ్రీశఠారిని పెట్టినప్పుడు ఆయనకు ఒక దివ్యానుభూతి కలిగినట్లు అనిపించింది. వెంటనే ఆ పండితునితో ‘‘స్వామీ, నేను కూడా శ్రీరంగనాథుని గురించి రాయడానికి ప్రయత్నిస్తానని’’ చెప్పారు.

ఇదంతా ఆ నమ్మాళ్వార్ల స్వరూపమైన శ్రీ శఠారిగా పిలిచే ఆ దివ్యపాదుకా ప్రభావం వల్ల ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. తాను కవిత్వం రాయడానికి ప్రయత్నిస్తున్నానంటూ దేశికులవారు నిద్రకు ఉపక్రమించారు. అదే సమయంలో ఆ పండితుడు దేశికులవారు నిద్రపోతుండటాన్ని చూసి, ఆయన ఎంతో కష్టపడి 300 శ్లోకాలను రాసి నిద్రపోయారు. అదే సమయంలో 3వ రaాములో పాదుకల సవ్వడి విని దేశికులవారు నిద్రలేచారు. లేచిన వెంటనే 1008 శ్లోకాలను సునాయాసంగా, రసరమ్యభరితంగా వివిధ ఛందోలంకారణ గుణ వృత్తిరీతులలో రచించారు. అదే ‘పాదుకా సహస్రం’. అద్భుతమైన అపురూపమైన, అద్వితీయమైన ఈ కావ్యాన్ని ఆయన అతి సులభంగా రచించారు. తెల్లవారిన తరువాత నిత్యకర్మానుష్టానాలను నిర్వహించి రంగనాథుని సన్నిధికి చేరుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉన్నప్పుడు, పోటీ చేయమని చెప్పిన పండితుడు అక్కడకు వచ్చి దేశికులవారు ఏమీ రాయలేదని, ‘కవితార్కిక సింహ’ బిరుదును అతని నుంచి తొలగించి తనకు ఇస్తారని ఆశతో తాను రచించిన 300 శ్లోకాలను సమర్పించారు.

తరువాత దేశికులవారు వినయంగా, ఎంతో భక్తితో శ్రీరంగనాథుల ఎదుట

‘సంతః శ్రీరంగపృథ్వీశ చరణత్రాణశేఖరాః ।

జయంతి భువనత్రాణ పదపంకజరేణవః॥’

అని వైదిక ఛందస్సు అయిన అనుష్టుప్‌ ఛందస్సులో ప్రారంభించి 32 పద్ధతులతో 1008 శ్లోకాలను స్వామివారికి సమర్పించారు. అదే సమయంలో దేవేరితో కలిసి శ్రీ రంగనాథులు ప్రత్యక్షమై ఎంతో ఆనందంతో ‘కవితార్కిక సింహ’ అనే బిరుదాన్ని దేశికులవారికి ఇచ్చారు.

దేశికులవారి కవితాశక్తికి ఆశ్చర్యపడిన ఆ పండితుడు తనను క్షమించమని ప్రార్థించినప్పుడు దేశికులవారు ‘‘స్వామీ! పాదాల కింద ఉండే పాదుకలపై నేను రాసిన పాదుకాసహస్రం కన్నా స్వామి పాదాలను గురించి మీరు చెప్పిన పదకమల స్తోత్రమే గొప్పది. పాదాల కిందనే పాదుకలు ఉంటాయి కదా! అందుకే మీరు రాసిన స్తోత్రము విశేషమైనదని నేను భావిస్తాను’’ అని వినయంగా చెప్పారు.

అక్కడ ఉన్న పండితులు దేశికులవారి సహృదయతకు సంతోషించారు. ఈ గుణం ఎలా సాధ్యమని ప్రశ్నించినప్పుడు ఇదే రామానుజ సిద్ధాంతమని అంటూ నిర్మల హృదయంతో భగవంతుడిని సేవించడమే ముఖ్యమని, కవితార్కిక సింహ అనే బిరుదు తనకు గొప్ప కాదని, ‘పాదుకాసేవక’ అన్న బిరుదమే తన జీవితానికి సార్థకతను ఇస్తుందని దేశికులవారు సెలవిచ్చారు.

కలి ప్రభావంతో కష్టపడుతున్న జనులను సంరక్షించేందుకు అవతరించిన వేదాంత దేశికులవారు చెప్పిన శ్రీ రంగనాథ పాదుకా సహస్రాన్ని అందరూ పారాయణం చేయాలి.

-ప్రొఫెసర్‌, డా. చక్రవర్తి రంగనాధన్‌

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour