పదునైదవ శతాబ్ధమున తెలుగు సాహిత్యాకాశమున దేదీప్యమానముగా సూర్యునివలె వెలిగినవాడు శ్రీనాథ మహాకవి. ఉత్తరార్థమున చల్లని వెన్నెలలు విరియించిన చంద్రునివంటి వాడు పోతన. పోతన మహాభక్తుడు. కవిత్వ పాండిత్యము ఆయనను సహజముగా వరించినవి. రాజాశ్రయమునకు దూరంగా ఉండి సాధారణ కర్షక జీవితము అవలంబించి తెలుగునాట భాగవత కల్పతరువును నాటిన మహాకవి పోతన. తెలుగుజాతికి తెలుగు కవిత్వమునకు సుకృతము పంటలాగా పోతన కవిత్వాలు నిలిచాయి.
ప్రాచీన సాహిత్యమంతటిలో రెండే రెండు కృతులు పేర్కొనవలసి వచ్చినచో ఒకటి కవిత్రయము వారి భారతము, రెండవది పోతన బాగవతము. పరమాత్మ సాక్షాత్కారమునకు భారతమును కర్మ లేదా జ్ఞాన మార్గము వంటిదనుకొన్నచో భాగవతమును సులభమైన భక్తిసాధనమనుకొనవచ్చును. చైతన్యునికన్న 50 ఏండ్లు ముందుగా తెలుగుదేశమున కృష్ణతత్వమును పండించినవాడు పోతన. భావబంధురమైన కవితాస్ఫూర్తితో, శ్రవణపేయమైన శబ్ధాలంకారములతో, అంత్యప్రాసల విన్యాసముతో, గానయోగ్యమౌ గీతిగుణముతో, మధురభాషాశైలితో, రసస్యంది పద్యరచనమొనర్చుట పోతనగారి విశిష్టగుణములు. భక్తి రసమును మెప్పించుపట్ల ఆయా పాత్రలతో తాదాత్య్మమొందునంత నిష్ఠగలవాడు పోతన. మధుర భక్తి ఆయన రచనలో ఉజ్వలంగా ఉండేవి. పండితులే కాదు పామరులు సైతం తెలుగునాట పోతనగారి పద్యములు ఒకటియో రెండో రాని వారుండరన్నచో అతిశయములేదు.. భాగవతమందలి ప్రహ్లాదచరిత్రము. ధ్రువోపాఖ్యానము, గజేంద్ర మోక్షము, వామనావతార ఘట్టము, శ్రీ కృష్ణ జననము, బాల్య లీలలు, రుక్మిణీ కల్యాణము వంటి ఘట్టములు ఆబాలగోపాలానికి ఆస్వాద్యమానములుగా చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుజాతి జీవనాడి స్పందనను పట్టుకొన్న రచన పోతనగారి ఆంధ్రభాగవతమేనని చెప్పవచ్చు. పోతన తెలుగువారి జాతీయకవి. పోతన భాగవతము సంస్కృత భాగవతమునకంటే పరిమాణములోను, విషయంలోను మిన్నగా పేర్కొంటారు.