శ్రావణమాసం పవిత్రమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ పూర్ణిమ తదితర పండుగలు వస్తాయి. ఈ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవిని ‘మంగళగౌరీ’గా కొలుస్తూ చేసే మంగళగౌరీ నోముతోపాటు, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మహాలక్ష్మిని ‘వరలక్ష్మీ’ పేరుతో అర్చిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ‘పవనం సంపూజ్య కల్యాణం వరలక్ష్మీ స్వశక్తి దాతవ్యం అన్నట్లు వరాలనిచ్చే లక్ష్మీ వరలక్ష్మీయని శుక్రవారం వ్రత నియమాలను పాటిస్తూ పూజిస్తే కోరిన వరాలను అనుగ్రహిస్తుందంటారు. సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి లోకాలన్నింటిని వీక్షిస్తాడని అందుకే శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువు సానిధ్యంకోసం స్త్రీలు, పెళ్ళికాని యువతులు ఏ పూజలు, వ్రతాలు చేసినా అత్యంత శుభఫలాన్ని ఇస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.
‘సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాంశుక గంధమాల్య శోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసేద మహ్యం’’ అంటూ ఆదిశంకరులు లక్ష్మీదేవిని స్తుతించారు. మహాలక్ష్మీదేవిని దేవతలు, మానవులే కాదు త్రిమూర్తులు కూడా ఆరాధించినవారే. ధర్మసంస్థాపన చేయడంలో ప్రధాన ప్రాత వహించే శుద్ద సత్వస్వరూపిణి సముద్ర రాజ తనయ,చంద్ర సహోదరి పసిడి వర్ణంతో వెలిగే మహిమాన్విత శక్తి స్వరూపిణి ఆది పరాశక్తి రూపమే మహాలక్ష్మి.
తన చల్లని చూపులతోనే సర్వలోకాలను ఐశ్వర్యమయం చేయడంతోపాటు సకల శుభాలు చేకూర్చగల మహాశక్తిదాయిని, సౌభాగ్య సంతాన ఫలాన్ని ఇచ్చి కోరికలను తీర్చే వరప్రదాయిని శ్రీ మహాలక్ష్మీదేవి. కుటుంబ సుఖసంతోషాలకోసం స్త్రీలు నోచుకునే వ్రతాలు మన సంప్రదాయంలో ఎన్నెన్నో ఉన్నా భక్తిశ్రద్ధలతో నోచుకునే ‘వరలక్ష్మీవ్రతం’ అన్నింటిలోకి ఉత్తమమైనదిగా ఈ వ్రత వైభవాన్ని భవిష్యోత్తర పురాణంలో పరమ శివుడు సాక్షాత్తు పార్వతిదేవికి వివరిస్తాడు. పార్వతి దేవి శంకరునితో స్వామీ! లోకంలో మేలైనది, వ్రతాల్లో కెల్లా ఉత్తమమైన వ్రతం ఏమైనా ఉన్నదా? అని అడిగినప్పుడు పరమశివుడు పార్వతిదేవితో వ్రతాలలకెల్లా ఉత్తమమైన వ్రతం ‘వరలక్ష్మీ వ్రతం’ అని దీనిని శ్రావణ మాసమందు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని చెప్పాడు. దక్షిణయానంలోని వర్షఋతువులలో వచ్చే శ్రావణమాసం రానే వచ్చింది.
ఈ వ్రతానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. కష్టాల్లో ఉన్న చారుమతి ఈ వ్రతం ఆచరించాలని నిర్ణయించింది.చారుమతి తన స్నేహితురాళ్ళకు పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు చేసే వ్రత విషయం చెప్పి అందరినీ ఆహ్వానించింది. తెల్లవారురaామునే నిద్రలేచి అభ్యంగనస్నాన మాచరించి పట్టుచీర ధరించింది. ఇంటిలో ఈశాన్యభాగాన దేవుని మూలన ఆవుపేడతో అలికి ముగ్గులు తీర్చింది. ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, ఆ మండపంలో కొత్త బియ్యంపోసి అష్టదళ పద్మంగా తీర్చిదిద్ది, ఆ బియ్యంపై జలకలశాన్ని పెట్టి అందులో మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్ళలనే పంచపల్వాలను ఉంచింది. ఆ కలశంపై పూర్ణఫలమైన నారికేళా నుంచి, దానిపై ఎర్రటి రవిక గుడ్డను అలంకరించి, కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. విధి విధానంగా శాస్త్రోక్తంగా ఆ కలశంలో జగన్మాత అయిన లక్ష్మీదేవిని ఆవాహనం చేసి ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో అర్చించి, అనేక విధాలైన పిండివంటలను భక్ష్యాలను ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేసిన తోరాన్ని అర్పించి దాన్ని కుడిచేతికి కట్టుకుని ప్రతి సంవత్సరం ఇలాగే వ్రతాన్ని చేసేదనని వరలక్ష్మీ ముందు ప్రమాణం చేసి భక్తితో ప్రదక్షిణానమస్కారాలు చేసింది. మొదటి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయగానే చారుమతికి, తోటి పుణ్యస్త్రీలందరికి కాలుయందు ఘల్లు ఘల్లున మ్రోగే గజ్జెలు కలిగాయి. రెండు, మూడో ప్రదక్షిణలు చేయగా స్త్రీలందరికీ శరీరమంతటా అపాదమస్తకం నవరత్నాలు పొదిగిన బంగారు హారాలు వచ్చాయి. తరువాత వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన పురోహితునికి చందన, దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరిచింది. ఆనాటి నుంచి చారుమతి కష్టనష్టాలకు దూరమై పుత్రపౌత్రాదులతోనూ, ధనధాన్య సమృద్ధిని పొందిందని, నాటి ఈ వ్రతానికి వరలక్ష్మీ వ్రతంగా లోకాన ప్రసిద్ధమై మహిమాన్వితమై ఆచరించడం జరుగుతోంది.
ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు ఆచరించడానికి వీలులేని వారు అదే శ్రావణమాసంలో తరువాత వచ్చే శుక్రవారం అయినా చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చి చేయలేకపోతే వెంటనే వచ్చే అశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల్లో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. ఈ వరలక్ష్మీ దేవీ వ్రతాన్ని ఆచరించ శక్తిలేనివారు, ఆరోజున శ్రీమహాలక్ష్మీ స్తోత్రాన్ని, శ్రీసూక్తాన్ని పఠించినా చక్కటి ఫలితాన్ని పొందుతారు.