నెల్లూరు నగరంలో శ్రీ రంగనాథస్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి దేవస్థానం, గురువాయురప్ప దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఉడయవర్ల దేవస్థానం, శ్రీ వేదాంత దేశికుల దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తూ, శ్రీ ఆండాల్ తిరుప్పావై పాశురాలను ఘనంగా పారాయణ చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు శ్రీ వైష్ణవ అధ్యాపకులు అధ్యయనోత్సవాలను తిరుప్పావై పాశురాలను పారాయణ చేస్తూ, భగవద్ శ్రీ రామానుజుల వేదాంత దేశికుల పరంపరగా వస్తున్న కైంకర్యాలను, విశేషాలను తెలియజేస్తూ, గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారికి ఏ విధంగా కైంకర్య చేసిందో తమ ప్రవచనలా ద్వారా తెలియజేస్తున్నారు.
నెల్లూరు నగరంలోని వేదాంత దేశికులు దేవస్థానంలో వేద పండితులు దివ్య ప్రబంధ పారాయణకులు కిడాంబి సంపత్ నారాయణ ఆచార్యులు, కిడాంబి వరద రాజన్ తదితరులు ప్రవచనాలు చేస్తూ, శ్రీ వేదాంతదేశికుల భక్తిభావాన్ని వారు రచించిన స్తోత్రాల గురించి అందరికీ తెలియజేశారు. శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం లో ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాథచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, నరసింహాచార్యులు ,కె సి వరదరాజన్ తదితర శ్రీ వైష్ణవ భక్త బృందం ఆండాల్ గోష్టి ‘‘మాలే మణివణ్ణా’’ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.