న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవిని, శ్రీ రంగనాధ స్వామిని అందంగా అలంకరించి తిరుప్పావై పాశురాలను సేవిస్తున్నారు. పలువురు భక్తులు ధనుర్మాసవేళలో గోదాదేవి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసంగా పిలుస్తారు. సాక్షాత్ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే ‘‘తిరుప్పావై’’. ద్రావిడ భాషలో ‘‘తిరు’’ అనగా పవిత్రమైన, ‘‘పావై’’ అనగా వ్రతం, వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో శ్రీరంగనాధుడిని ధనుర్మాసమంతా పూజించింది. భోగి పండుగ నాడు గోదారంగనాధుల వివాహ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ధనుర్మాస మహోత్సవాన్ని న్యూయార్క్‌లో ఉన్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో కూడా శ్రీ కృష్ణదేశిక జీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భక్తులంతా స్వామివారిని దర్శించి, తిరుప్పావై పాశురాలను పాడి తరిస్తున్నారు.