ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మీ ఆండాళ్ సహిత శ్రీ కృష్ణదేవాలయం. ఆశ్రమం, వేదపాఠశాల ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవం సందర్భంగా 17వ తేదీన విష్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 18వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహన ఆరాధనలు వంటివి జరిగాయి. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుష్టాన అర్చన మూలమంత్ర గాయత్రీ సహిత పంచసూక్త హోమములు, విగ్రహములకు ధాన్యాదివాసము, అధివాస హోమము, లఘు పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు జరిగాయి. 19వ తేదీన ప్రబంధ పారాయణాలు, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధనలు, హోమములు, పంచామృత అభిషేకం తదితర కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం గ్రామోత్సవం జరిగింది. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుష్టాన అర్చనలు, హోమములు, పరివార హోమం, ప్రాయశ్చిత్త హోమం ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. 20వ తేదీన ద్వార తోరణ ధ్వజకుంభ ఆరాధనలు, కళాన్యాస హోమం, యంత్ర స్థాపన, విగ్రహ ప్రతిష్ఠ, విమాన కలశ స్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. మహా కుంభ సంప్రోక్షణ, శాంతి కళ్యాణ మహోత్సవం, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేదపాఠశాలను, గోశాలను కూడా ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ఉన్న గ్రామస్థులతోపాటు స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. దాదాపు 10,000మందికిపైగా హాజరయ్యారు. అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.