Paramparaa – The Tradition Continues…

శ్రీ  మహాలక్ష్మి మహా వైభవ  ఆవిర్భావం 

ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్టోః పరాం ప్రేయసీం

తద్వక్షః స్థల నిత్యవాసరసికాం తత్‌క్షాంతి సంవర్ధినీమ్‌

పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం

వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం

భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుని హృదయంలో  నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ, పద్మాసనంలో వేంచేసి  సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ  అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఇవే మన నమస్కారములు. 

సంపూర్ణ విశ్వంలో  సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, సర్వ భక్తుల  కోర్కెలను తీర్చే అమృతమూర్తి  శ్రీమన్నారాయణులవారి ప్రియ సఖియైన శ్రీ మహాలక్ష్మి.ఆ తల్లి ఉన్నచోట సర్వ సౌభాగ్యాలు నిలయమై వుంటాయి. దేనికీ కొరత వుండదు.

   ఆ జగన్మాతను ఆరాధించేవారికి ఆ తల్లి సర్వసౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను,అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచేవారికి  జీవితమంతా ఏ లోటూ లేకుండా శుభప్రదంగా జరుగుతుంది.

బ్రహ్మదేవుని మానస పుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన  భార్య పేరు ఖ్యాతి. _ సకల విద్యా పారంగతుదైన భృగుమహర్షి ఒకసారి ఆది

పరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగుమహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైనది. అప్పుడు ఆ మహర్షి  ఆదిశక్తియైన ఆ తల్లిని అనేక విధాల స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో  సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించినది. 

 మహర్షి  ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు. తల్లీ! జగన్మాతా! నీవు ముల్లోకాలను  ఏలే శక్తి స్వరూపిణివి. _ నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా  జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపిణివైన నీ అంశలతోనే పార్వతి, సరస్వతి,

గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా, మహా శివుని అర్భాంగిగా  వెలుగొందుతున్నది. ఇక సర్వ విద్యలకూ  అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా  భాసిస్తున్నది నీలోని సరస్వతీ రూపమే కదా తల్లీ! ఇక మూడవదైన వైభవ కళ అగు     శ్రీ మహాలక్ష్మీ స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లీ! అని” అర్ధించాడు.

    జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది.భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నోవిధాల స్తుతించాడు. అంతట ఆ  తల్లి అంతర్భానమైనది. 

ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన యందలి ఐశ్వర్య కళతో  శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది. కమలములవంటి కన్నులు, మన్మధుని విల్లువంటి  కనుబొమ్మలు, మోదుగ చిగుళ్ళవలె ఎర్రనైన పెదవులు, అద్భుతమైన చెక్కిళ్ళతో దివ్యంగా  ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఓ జగజ్జననీ! జగన్మాతా! శ్రీ మహాలక్ష్మీ  నీకివే మా నమస్కారములు.

      ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు. ఆ తపస్సును  భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారు ఎన్నో రకాలు  దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది తెలుసుకున్న దూర్వాసుడు  మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వ సంపదలూ కోల్పోతాడని  శపించాడు. ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వసౌభాగ్యాలను కోల్పోయాడు.  ఇంద్రలోకం కళావిహీనమైనది. _ అప్పుడు శ్రీమహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి  సముద్ర గర్భంలో దాగున్నది. సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన  తప్పులు తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణులవారి వద్దకు వచ్చాడు.

           శ్రీమన్నారాయణులవారిని ఇంద్రుడు ఈవిధంగా ప్రార్ధించాడు. ఓ స్వామీ!  కరుణామయా! జగన్నాథా! జగద్రక్షకా! నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు  భోగ భాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరచి  దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనైనాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను  కోల్పోయాను. ఇంద్రలోకం కళావిహీనంగా  తయారైంది. దయచేసి నన్ను  అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసింది. జనార్దనా!  జగత్ర్రభూ! నాకు నీవే దిక్కు అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని  వేడుకున్నాడు.

      అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణులవారు మహేంద్రుని  దీన స్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు. ఓ ఇంద్రా! నీవు చింతింపవలదు. శ్రీ  మహాలక్ష్మీ ప్రస్తుతం సముద్ర గర్భంలో వున్నది. కొంతకాలం తరువాత దేవదానవుల  సముద్ర మధనంలో ఆమె నా చెంతకు రాగలదు. అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక  చేకూరుతుంది అని అన్నాడు. దేవేంద్రుడు శ్రీమన్నారాయణులవారికి నమస్కరించి  శలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి  సంకల్పించారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణులవారి వద్దకు వచ్చి సముద్ర

మధనంలో తమకు సహకరించవలసినదిగా అర్ధించారు. శ్రీమన్నారాయణులవారు  వారితో సర్పరాజైన వాసుకిని తోడుగా చేసుకుని, మందర పర్వతంతో సముద్రాన్ని  చిలకమని చెప్పాడు.

దేవదానవులు ఆవిధంగానే చేసి సముద్రమథనాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు  ఉద్భవించింది. కామధేనువును వశిష్ఠ మహర్షులవారు స్వీకరించారు. అటు  తర్వాత సముద్రం నుండి దివ్యాశ్వం (ఉచ్చెశ్రవం  ) అవతరించింది. దానిని బలి  చక్రవర్తి స్వీకరించాడు. దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మధించగా  అందునుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవించాయి. వాటిని  మహేంద్రుడు తీసుకున్నాడు. అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది.సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది. దేవకన్యలందరూ అద్భుతంగా  గానం చేయసాగారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో  వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ  ఆశ్చర్యపోయారు. ఎవరి నోట మాట రాలేదు. 

     అప్పుడు క్షీర సముద్ర రాజతనయ ఆ శ్రీమహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది.  శ్రీమన్నారాయణులవారు శ్రీ మహాలక్ష్మిని అర్జాంగిగా స్వీకరించాడు. _ బ్రహ్మాదిదేవతలందరూ ఎంతో సంతోషించారు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది.  శ్రీ లక్ష్మీ నారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పుదుము. సర్వజీవుల పహృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వ జీవుల  శుభమునూ, సుఖమునూ చూసే నారాయణుడు, సర్వ జీవకోటిని ఆప్యాయంగా,  అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శనభాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు.

మీ అందరినీ శ్రీ లక్ష్మి నారాయణులు చల్లగా చూడు గాక !

విశ్వపతి

( తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి)

www.lordofsevenhills.com

E-Mail : [email protected]

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour