Paramparaa – The Tradition Continues…

5000 మంది రుత్వికులు…వేదమంత్రోచ్ఛారణలతో పులకరించిన ముచ్చింతల్‌

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంతం పులకరించిపోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో ప్రాంగణమంతా అత్యంత శోభాయమానంగా మారింది. అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని సేకరించారు. ఉత్సవ మూర్తితో పాటు పుట్టమన్నును భాజా భజంత్రీలతో ప్రధాన యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ మట్టిని అప్పటికే అక్కడ సిద్ధం చేసిన కుండలాల్లో నవ ధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ సమయంలోనే రుత్వికుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల నోట నారాయణ జపాలతో ఆ ప్రాంతం భక్తి పారవశ్యం లో మునిగిపోయింది.12 రోజుల పాటు జరగనున్న హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనే రుత్వికులకు రక్షా సూత్రాలు(కంకణాలు), వస్త్రాలు అందజేశారు. ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుత్వికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌ స్వామి, రామచంద్ర జీయర్‌ స్వామి, రంగ రామానుజ జీయర్‌ స్వామి, అష్టాక్షరి జీయర్‌ స్వామి, వ్రతధర జీయర్‌ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు.