Paramparaa – The Tradition Continues…

సేవల్లో మిన్న… విమలా రంగాచారి

చిన్నప్పుడు దేశభక్తితో అందరినీ మెప్పించి, వివాహం తరువాత కుటుంబ బాధ్యతలతోపాటు భర్తకు తోడునీడుగా ఉంటూ, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని మంచి పేరు తెచ్చుకున్న శ్రీమతి విమలా రంగాచారిగారు అందరి శ్రేయోభిలాషిగా ఉంటున్నారు. మాతరంలో ఉన్న స్ఫూర్తి నేటితరంలో కనిపించడం లేదని దానిని పెంపొందించేలా చేయాలన్నదే తన ఆశయమని ఆమె చెబుతున్నారు.


చిన్ననాటి సంగతులు…

నేను పుట్టింది కలకత్తా అయినా నా బాల్యం మాత్రం నెల్లూరు జిల్లాలో సాగింది. మా అమ్మ పేరు కమల, నాన్నగారి పేరు సంపత్‌ అయ్యంగార్‌. మా నాన్నగారు కలకత్తాలో హౌరా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. 1938, మార్చి 26వ తేదీన నేను కలకత్తాలో జన్మించాను. నాకు ఓ అన్నయ్య, ముగ్గురు అక్కాచెల్లెలు ఉన్నారు.  మా అన్నయ్య పేరు జగన్నాథన్‌. అక్కచెల్లెళ్ళ పేర్లు పద్మావతి, మధురవల్లి, మైథిలి, రంగమణి.


జపాన్‌ వార్‌ రావడం వల్ల మా నాన్నగారు మా అమ్మను, మమ్మల్ని మా అమ్మఊరైన నెల్లూరుకు పంపించారు. అమ్మమ్మ ఇంటికి పక్కనే మేము ఇల్లు తీసుకుని అక్కడే మేనమామ పర్యవేక్షణలో పెరిగాము. నెల్లూరులోనే సెటిల్‌ అయిపోయాము.  ఎబిఎం గర్ల్స్‌ హైస్కూల్‌లో నా ప్రాథమికోన్నత విద్యాభ్యాసం సాగింది.  కాలేజీ చదువు నెల్లూరు వి.ఆర్‌ కాలేజీలో సాగింది. ఎంపిసి తీసుకుని ఇంజనీర్‌ అవ్వాలని అనుకున్నాను కాని ఇంజనీర్‌ కాలేకపోయాను. చదువులో మాత్రం రాణించాను.
స్వాతంత్య్ర సమరం ఉధృతంగా జరుగుతున్న సమయం.. అప్పుడు మా నాన్నగారు కలకత్తా నుంచి మా ఊరికి వచ్చేశారు. మా నాన్నగారికి కాంగ్రెస్‌ అంటే, నెహ్రూ అంటే చాలా అభిమానం. అది తెలుసుకున్న నెల్లూరులోని కాంగ్రెస్‌ నాయకులు ఎసి సుబ్బారెడ్డి, వెన్నలకంటి వంటి నాయకులు నాన్నను కలుసుకుని ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. నాన్నగారితోపాటు మేము కూడా ఉద్యమంలో మా గొంతు కలిపాము. మేము చిన్నవాళ్ళమైనందువల్ల బుర్రకథ, పాటలు పాడటం వంటి బాధ్యతలను మాకు అప్పగించారు. అప్పుడు నా వయస్సు 9 సంవత్సరాలు.  నా గొంతు బాగుంటుందన్న ఉద్దేశ్యంతో నాకు ఈ బాధ్యతలను నాయకులు అప్పగించారు. వీధుల్లోనూ, చిన్న చిన్న పందిళ్ళలో ఉపన్యాసాలు జరిగిన తరువాత నాతోపాటు పిల్లలంతా కలిసి  బుర్రకథ, పాటలు పాడేవాళ్ళం.  1948వ సంవత్సరం జనవరి 30 సాయంకాలం మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ చనిపోయినట్లు వార్త రావడంతో దేశమంతా కలకలం చెలరేగింది. అమ్మ నాన్నలతో వారి స్నేహితులు, ఇరుగుపొరుగువారు శోకంతో వార్తను చెప్పుకోవడం చూసినప్పుడు గాంధీ ఎంత గొప్పవాడో అనిపించింది. మా ఇంటి హాలులో ఆయన ఫోటో పెట్టి పదిరోజులపాటు భజనలు, పాటలు, ఆయన చేసిన త్యాగాలను గురించి ఉపన్యాసాలు చెప్పారు. వారికి ఇష్టమైన వేరుశెనగలు, మేకపాలను ఆయన ఫోటో ముందు ఉంచి అందరికీ ఇచ్చేవారు. ఆరోజుల్లో మహనీయుడు చనిపోతే ప్రజలంతా ఎలా చేసుకునేవారో నేటితరానికి చెబితే ఆశ్చర్యపోతున్నారు. అప్పటివారి దేశభక్తి ఎంత నిస్వార్థమైనదో తెలుసుకోవాల్సిన అవసరం నేటితరానికి ఉంది. అదే విధంగా పెద్దలు కూడా దేశభక్తిని పెంపొందించేలా తమ పిల్లలకు నాటి నాయకుల విషయాలను తెలియజేయాలి. మా చిన్నతనంలో తల్లితండ్రులు దేశభక్తిని నూరిపోసే రచనలను చదివించేవారు. లాలా లజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌, బాలగంగాధర్‌ తిలక్‌, భగత్‌ సింగ్‌ లాంటి గొప్ప నాయకులు చేసిన పోరాటాలను మాకు తెలియజెప్పి మాలో దేశభక్తిని నింపేవాళ్ళు.  దేశభక్తిని రగిల్చే బుర్రకథలు చెప్పించి మాచేత పాడిరచేవారు.


శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, శ్రీమతి శేషు శ్రీరంగం సహకారంతో నెల్లూరులోనూ చుట్టుపక్కల స్థాపించిన మహిళా మండళ్ళలో నాతోటి చిన్నపిల్లలంతా కలిసి పాటలు పాడేవాళ్ళం. నేను చెప్పిన బుర్రకథలోని నాలుగైదు వాక్యాలు…
‘1948 జనవరి 30వ తేదీ సాయంకాలం బిర్లా భవనం నుంచి మహాత్ముడు బయలుదేరుచుండ !తంధానతాన’!!
వీధి దగ్గర దుష్టుడొక్కడు పిస్టల్‌తో వచ్చి మహాత్ముని కాల్చివేశాడు ‘తంధానతాన’!
హేరామ్‌ హేరామ్‌ అంటూ గాంధీ నేలకొరిగినాడు !తంధానతాన’!!
ఇలా మహాత్ముని కాల్చివేసిన ఘట్టాన్ని వర్ణించేవాళ్ళం.


నాటకంలో కూడా…

నేను చిన్నప్పుడు ఓ నాటకంలో కూడా చిన్నపాత్రను పోషించాను. శివుడు పార్వతికి జాతకం చెప్పిన సన్నివేశంలో ఎరుకులసానిగా నేను వేషమేశాను. నెల్లూరు టౌన్‌హాల్‌లో ఈ ప్రదర్శన జరిగింది. ఆంధ్ర బాలానందం టౌన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా నేను ప్రార్థనాగీతం పాడాను.
స్కూల్‌ వార్షికోత్సవంలో కూడా నా చేత నాటికలను వేయించ ేవారు. వాపస్‌ అనే ప్రదర్శన చేసినప్పుడు ఎంతోమంది పెద్దలు నన్ను ప్రశంసించిన విషయాన్ని నేను మరచిపోలేదు. నెల్లూరులో అప్పుట్లో ప్రముఖ అడ్వకేట్‌గా ఉన్న గుర్ర సుబ్బ రామయ్యగారు నా సంభాషణల ఉచ్ఛారణను చూసి ఆశ్చర్యపోయి బహూమతి ఇచ్చారు. ఇంతవరకు స్కూల్‌ జీవితం సాగింది.

ఇక స్కూల్‌లో నాచేత ప్రిన్సిపాల్‌ మిస్‌ విల్లి నాచేత కుట్టుపనులు చేయించి అమెరికాకు పంపారు. అప్పుడే నాకు ఎన్నో విలువైన బహుమతులను ఇచ్చారు. కాని ఆరోజుల్లో దాని విలువ తెలుసుకునే వయస్సు లేనందువల్ల వాటిని నేను దాచుకోలేకపోయాను.


వివాహ వేడుకలు

ఆరోజుల్లో ఈరోజులాగా ఇష్టం వచ్చినవాళ్ళను పెళ్ళి చేసుకోవడం వంటివి ఉండేవి కావు. పెద్దలు చూసిన సంబంధం చేసుకోవడం మాత్రమే ఉండేది. నా వివాహం కూడా పెద్దలు చూసి ఓకె చెప్పిన తరువాతనే జరిగింది.    
నెల్లూరు దగ్గర అల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ధనవంతులైన రామకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి వాళ్ళ సహకారంతో అల్లూరు శేషాచార్యులు ఓ పాఠశాలను స్థాపించారు. రామకృష్ణా హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పేరుతో ఇది ఏర్పాటైంది. మాడభూషి శేషాచార్యులు మరణించిన తరువాత వారి సంతానం శ్రీ నరసింహాచార్యులు, శ్రీ కృష్ణమాచార్యులు, శ్రీ సుందరాచారి, శ్రీ రంగాచారి. వారిలో శ్రీ నరసింహాచార్యులు, శ్రీ కృష్ణమాచార్యులు పెద్దవాళ్ళు కావడం వల్ల వారు ఈ స్కూల్‌ బాధ్యతలను చేపట్టారు. వారు సమర్థవంతంగా స్కూల్‌ను నడపడంతో వారికి ఆ గ్రామంలో మంచి పేరు వచ్చింది. వాళ్ళ చివరి తమ్ముడైన ఎం. రంగాచారిగారితో నా వివాహం జరిగింది. అప్పుట్లో అల్లూరు వాళ్ళకు పెద్ద ఆస్తి చదువు మాత్రమే. వాళ్ళ ఇంట్లో గోడగీసినా చదువు అంటూ చెబుతుందని ఆ గ్రామస్థులు అంటుంటారు.
మంచి విద్యావంతుల కుటుంబం నుంచి సంబంధం రావడంతో మా నాన్నగారు ఏదీ ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. పిల్లవాడు ఉన్నత విద్యావంతుడు. బిఎ ఆనర్స్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌, పైగా ఎజి ఆఫీస్‌లో ఉద్యోగం అంటూ నాకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు.


అటువైపు నాకు కాబోయే భర్త రంగాచారిగారికి తల్లితండ్రులు లేకపోవడం వల్ల అంతా వాళ్ళ అన్నగార్లే పెళ్ళి పెద్దలుగా వ్యవహరించారు. జాతకాలు సరిపోవడంతో మా పెళ్ళిని మా నాన్నగారు ఘనంగా జరిపించారు. నెల్లూరులో ఉన్న  సింగరాజు రామారావు అనే జడ్జిగారింట్లో ఆగస్టు 28 1958న మా వివాహం జరిగింది. మా విహాహానికి బంధుమిత్రులెందరో హాజరయ్యారు. విఆర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీ సచ్చితానంద, ఎసి సుబ్బారెడ్డి, ఎబిఎం గర్స్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ మిస్‌ విల్లి (అమెరికన్‌ లేడీ) ఇలా ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. నా పెళ్ళిని దగ్గరుండి చూసి మన సంప్రదాయాలను మిస్‌ విల్లి తెలుసుకున్నారు. మా పెళ్ళికి వచ్చిన వారికి ఆతిధ్యం కూడా బాగానే చేశారు. చేసిన వంటకాలు, పిండివంటలు చూసి అల్లూరు రెడ్డే ఆశ్చర్యపోయారు.

పెళ్ళయిన తరువాత…


పెళ్ళయిన తరువాత మా కాపురం మద్రాస్‌లోని ఇలియట్స్‌రోడ్డులో ప్రారంభమైంది. పెళ్ళయిన వెంటనే మా తండ్రిగారితో బావగారి పిల్లలు రాజగోపాలచారి, రాఘవాచారి మాతో ఉంటారని చెప్పినప్పుడు మా తండ్రి కూడా మా అమ్మాయి వంట కూడా బాగానే చేసిపెడుతుందని చెప్పి, వాళ్ళతోనే ఉండమని చెప్పారు. కాని నాకు నిజంగా అప్పుడు ఏ వంట రాదు. కాని ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మా అక్క నేను నీకు సహాయం చేస్తానని చెప్పి మెల్లమెల్లగా వంటలు ఎలా చేయాలో నేర్పించింది. నా అదృష్టమేమో పిల్లలు రాజు, రాఘవాచార్యులు నా వంటలు ఎలా ఉన్నా తినేవాళ్ళు. తరువాత మా వారు నాగార్జున సాగర్‌కు బదలీ అయ్యారు. అక్కడకు వెళ్ళిన తరువాత వంటల్లో ప్రావీణ్యం సంపాదించాను.

సేవా కార్యక్రమాలు…


మావారు నాగార్జున సాగర్‌కు బదలీ అయిన తరువాత నాకు ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాను. గణితంలో నాకున్న ప్రావీణ్యంతో ట్యూషన్లు చెబుతూ, మరోవైపు లేడీస్‌ క్లబ్‌లో చురుకైన పాత్రను పోషించాను. అప్పటి చీఫ్‌ ఇంజనీర్‌ భార్య శ్రీమతి లతా రాజేంద్ర కుమార్‌ ప్రోత్సాహంతో, దర్భా భాస్కరమ్మ తోడ్పాటుతో సంగీత రూపకాలలో కూడా పాటలు పాడే అవకాశం, రచనలు చేసే అవకాశం నాకు లభించింది. కృష్ణ తులాభారం, నల దమయంతి, భక్త మీరా వంటి రూపకాలను నాగార్జున సాగర్‌లో వేశాము. మిస్‌ రుత్‌సిగ్మన్‌ క్రిస్మస్‌ మాత ప్రచారం కోసం నాగార్జున సాగర్‌ వచ్చినప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె లేడీస్‌క్లబ్‌ తరపున పేదలకోసం ఏదైనా చేసి పిల్లలను ఆదుకోవచ్చుగా అని చెప్పింది. దాంతో నేను, శ్రీమతి చూడామణి కలిసి వడియాలు, అప్పడాలు చేయడం నేర్చుకుని అమెరికాకు దానిని పంపించాము. దాని ద్వారా వచ్చిన డబ్బులను పేద పిల్లల చదువులకు వినియోగించాము. హైదరాబాద్‌లో కూడా పేద పిల్లలు ఉంటే వారి చదువుకు నావంతుగా సాయపడుతున్నాను. నాగార్జున సాగర్‌లో ఉన్నప్పుడే సినీనటి వాణిశ్రీతో, శ్రీమతి సరోజిని పుల్లారెడ్డిగార్లతో పరిచయం కలిగింది. అన్నీ కార్యక్రమాల్లో నేను ముమ్మరంగా పాల్గొన్నానంటే దాని వెనుక మావారి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. ఆయన నన్ను అన్నీ విషయాల్లో ప్రోత్సహించడం వల్లే నేను ఈరోజు ఇలా అందరితోనూ కలిసిపోయి ఉన్నాను.
మావారు కూడా ఉద్యోగంలో అందరితోనూ కలిసిపోవడంతో ఆంగ్లభాషలో మంచి ప్రావీణ్యం ఉండటం వల్ల ఆయన స్పీచ్‌ ఎంతోమందిని ఆకర్షించేది. దాంతో ఓవైపు ఆయన, మరోవైపు నేను లేడీస్‌క్లబ్‌, ఇతర కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నందువల్ల అందరికీ మేము కావాల్సినవారమైపోయాము. మాక్‌ పార్లమెంట్‌ లాంటివి చేసి పిల్లలతో యాక్ట్‌ చేయించడం ద్వారా అందరూ మమ్మల్ని గుర్తుంచుకునేలా చేసుకున్నాము. నేను అందరినీ కలిపి చేసిన కార్యక్రమాలు నాకు ఎంతోమంది మిత్రులను సంపాదించి పెట్టింది. 1995లో మేము నాగార్జున సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేముందు అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన వీడ్కోలు కార్యక్రమాలు నేను ఇంకా మరచిపోలేదు.

హైదరాబాద్‌


1995లో హైదరాబాద్‌కు వచ్చిన తరువాత అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. మొదట్లో ఇక్కడకు వచ్చినప్పుడు నగర జీవనం ఎలా ఉంటుందో అర్థమైంది. ఒకరికొకరు కలుసుకోవడానికి, ముచ్చట్లు పంచుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఎవరికీ వారు ఇంట్లోనే ఉండేవాళ్ళు. దాంతో నాకు మొదట్లో బోర్‌ కొట్టేది. కాని నాగార్జున సాగర్‌ నుంచి ఇక్కడకు వచ్చి నివసిస్తున్న ఎవి. అప్పారావు, దుర్గా ప్రసాద్‌ తదితరులు వాళ్ళ కార్యక్రమల్లో నన్ను కూడా పాలుపంచుకునేలా చేయడం వల్ల మళ్ళీ నేను పబ్లిక్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం లభించింది. హైదరాబాద్‌లో మాజీ ఎంపి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి నిర్వహణలో కూడా కొన్ని ప్రదర్శనలకు నాకు మాటలు, పాటలు పాడే అవకాశం లభించింది. రవీంద్రభారతిలో ఈ పాటల ప్రదర్శన జరిగింది.

కుటుంబం….


నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొదటివాడు హర్షవర్థన్‌. ఇప్పుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. మా రెండవవాడు విష్ణువర్థన్‌. దుబాయ్‌లో ఉంటున్నాడు. మా అమ్మాయిలు సబిత, భారతి ఇద్దరూ వాళ్ళ కుటుంబంతో హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour