మన సంప్రదాయంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో భోజన విధానం ఒకటి. భోజనం చేసే ముందు. చేసే సమయంలో, చేసిన తరువాత ఎలా వ్యవహరించాలో శాస్త్రంలో పేర్కొన్నారు. మనం భోజనం చేసేటప్పుడు పంచభూతాలను, భగవంతుడిని సంతృప్తిపరిచి మనం భుజించాలని చెబుతారు. భోజన విధానంలో పేర్కొన్న విషయాలు మొత్తంగా 20 ఉన్నాయి. అందులో భోజనానికి ముందు 8 విధానాలను పాటించాలి. అందులో మొదటిది
1) అతిధిరాకకోసం చూడటం – గృహస్థ ధర్మం ప్రకారము, తాను భుజించుటకు ముందు ప్రతిరోజు ఎవరైన అతిథి వస్తారా అని ఎదురు చూసి భోజనం చేయవలెను.
2) ఆచమనం – భోజనమునకు ముందుగా భోజనము తరువాత ఆచమనం చేయవలెను. విరామ సమయంలో (మధ్యాహ్న వేళ) చిరుతిండ్లు తిన్నా కూడా ఆచమనం చేయవలెను.
ఎ) పెరుమాళ్ల తీర్ధం బి) మామిడి పండు సి) చెరకు డి) తమలపాకు ఇ) సోమపానంకు మాత్రం ఆచమనం అవసరం లేదు.
3) భోజనానికి పీట, వస్త్రము, లేక దర్బాసనం వేసుకొని కూర్చోనవలెను.
4) స్థలశుద్ధి – ఎ) ఆకు పరిమాణం చతురస్రాకారంలో చేయవలెను
బి)నీటితో గోమయంతో స్థల శుద్ధి చేయవలెను.
సి) ప్రోక్షణం
5) ఆకు చేర్చుట
ఎ) ఆకు లేక తట్ట మాత్రమే ఉపయోగించవలెను ఒకరి తట్టలో మరొకరు భుజించరాదు. పత్రం (ఆకు) అయినా తట్ట అయినా బాగుగా శుద్ధి చేయవలెను.
బి) చేతిలో పెట్టుకుని తినుట, వస్త్రాలపై ఉంచుకొని తినుట, రాతిమీద పెట్టి తినుట నిషిద్ధం. పూవరసం ఆకులో కూడా తినరాదు.
(6) 5 అవయవములను తడిగా ఉంచుకొనవలెను అని రెండు కాళ్ళు, రెండు చేతులు, నోటిని తడిగా ఉంచుకొనవలెను. ఒక వేళ భోజనమునకు ముందుగా పై అవయవములు తడి లేకపోతే మరల తడి చేసుకొని భోజనానికి కూర్చోవలెను.
7) కూర్చోను విధానము – నిల్చుని తినడం, నడుస్తూ తినడం చేయరాదు. ఒక్క పెరుమాళ్ళ తీర్థం, తులసిని మాత్రం నిలబడి తీసుకోవచ్చును. అన్నప్రసాదాలు మాత్రం కూర్చొని భుజించవలెను.
పీఠ మీద కూర్చునే సమయంలో ఒకకాలు విధిగా భూమిమీద ఉండునట్లు కూర్చోవలెను. పద్మాసనం వేసుకుని కూడా కూర్చోవచ్చు. తూర్పు, పడమర అభిముఖముగాను లేక పెరుమాళ్ళ సన్నిధికి ఎదురుగా కూర్చోనవలెను.
8) పైపంచను నడుముకు చుట్టుకుని కూర్చోని భోజనం చేయవలెను. గృహస్థులు పంచకట్టు, ఉత్తరీయం (పైపంచను) నడుముకు చుట్టుకునవలెను. ఉత్తరీయం లేకుండా, ఉత్తరీయం కప్పుకొని భోజనము చేయరాదు.
పై చెప్పిన 8 విధానములు భోజనమునకు ముందుగా చేయవలెను.
9 భోజనము ప్రారంభం సమయంలో/ప్రారంభం
1) అన్నశుద్ధి – ప్రసాదానికి ముందుగా ఉప్పులేని పండ్లను ఆకులో లేదా తట్టలో వడ్డించవలెను. తరువాత భగవంతునికి నైవేద్యం గావించి పదార్ధములను స్వీకరించవలెను. అన్నం వేసి నెయ్యి వేయవలెను. ఇది అంతర్యామి నివేదన కొరకు (అంతర్యామిణేనమ’)
2) ప్రోక్షణం 3 వ్యాహృతి చేర్చి కొద్దిగా నీటిని వదలవలెను అన్నప్రసాద ఆకు చుట్టూ నీళ్ళు త్రిప్పుతూ పరిశేషనం చేయవలెను.
ఎ) స్థల శుద్ధి, (బి) అన్నప్రసాదమునకు, (సి) పరిశేచనం
ఓం భూర్భువః సువః ప్రాణాగ్ని హోత్ర మంత్రస్య బ్రహ్మారిషి, అనుష్టుప్చందః
వైశ్వానరాగ్ని దేవతా ప్రాణాగ్నిహోత్రే వినియోగః
3) నమస్కారం(వందనం)- ఆకులోని అన్న ప్రసాదాన్ని చూసి చేతులు జోడించి అస్మాకం నిత్యస్యమేతత్ అని చెప్పాలి.
4) అంతర్యామి నివేదనం- మన హృదయ కమలంలో వేం చేసి ఉన్న భగవంతునికి ముందుగా అన్నప్రసాదాన్ని నివేదించవలెను. అష్టాక్షర మంత్రమే నివేదన మంత్రం. ముందుగా సాలిగ్రామానికి చేసిన నివేదనాన్నే అంతర్యామికి నివేదనం చేయాలి.
5) పరిశేషనం- నీటిని చుట్టుట, వ్యాహృతి త్రయింతో నీళ్ళతో, తరువాత వేరొక మంత్రంతో ఆకు చుట్టూ ప్రదక్షణంగా నీటిని త్రిప్పవలెను.
6) శుద్దోదకం తరువాత మంత్రం లేకుండా ఒకసారి నీటిని ప్రదక్షిణంగా త్రిప్పవలెను. అపా శుద్దోదకం
7) ఆపోశనం – కుడిచేయి అరచేతిలో ఆచమనం వలె పెరుమాళ్ళ తీర్ధం తీసుకొని, అమృతా… అని చెప్పి సేవించవలెను.
ప్రాణాగ్నిహోత్రం పంచం ఆహుతి
ఓం ప్రాణాయ స్వాహాః అంటూ చెప్పాలి. అన్న ప్రసాదాన్ని పంటికి తగలకుండా స్వీకరించవలెను ఎడమ చేతితో హవిస్సుపాత్ర అంటే ఆకును పట్టుకొనవలెను. తర్వాత బ్రహ్మణమే…ఉచ్చరించవలెను.
10) గోవింద నామం – భుజించేటప్పుడు గోవింద నామమును ఉచ్చరించవలెను. శౌనక మహర్షి చెప్పినట్లు ఒక్కసారైన గోవిందనామం చెప్పి భుజించాలి.
11) హస్తోదకం – ఎడమ చేతికి నీటిని వదులట. దీనికి ఏమి మంత్రము లేదు. అన్నప్రసాదాన్ని ఉంచిన ఆకును తాకినందున ఆ చేతిని నీటితో శుభ్రం చేసుకుని భుజించడం ప్రారంభించాలి.
12) మౌనం – అన్నప్రసాదం తీసుకునేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా భుజించవలెను.
8+12 మొత్తం 20 విధులను భోజనం సమయంలో చేయాలని మన పెద్దలు చెప్పారు. శాస్త్రం కూడా ఈ విధంగానే తెలియజేసింది.
మొత్తం 20 పనులు అంటే భోజనానికి ముందుగా 8తరువాత 12 వీటి అన్నింటిని 2 లేక 3 నిముషములతో చేయవచ్చును. పరి శేషనం చేయకుండా అన్న ప్రసాదాన్ని తాకరాదు.
తరువాత నీటిని తీసుకుని అమృత పిదానమసి,,,అన్ని చెప్పి సగం తీర్థం తీసుకొని, మిగిలిన భాగాన్ని ఆకు ప్రక్కన చేతి కొనల వ్రేళ్ళతో వదలవలెను.
సేకరణ : కంభరాజపురం మురళీ
(Sri Yagnam Swamy Audio)