పితామహస్యాపి పితామహాయ ప్రాచేతదేశ ఫలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్
తిరుమలక్షేత్ర ప్రథమపౌరుడిగా ఆచార్య పురుష అగ్రగణ్యుడిగా పేరొందిన శ్రీశైలపూర్ణులు అనే తిరుమల నంబి భగవద్రామానుజాచార్యులవారికి సాక్షాత్తు మేనమామ. శ్రీవారికి దాదాపు 1020 సంవత్సరాలముందు తీర్థ కైంకర్యం, పుష్పకైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కైంకర్యాలను నిర్వహించిన మహనీయులు. అందుకే తిరుమల పేరు చెప్పినపుడు తిరుమలనంబి గుర్తుకువస్తారు. అదే విధంగా తిరుమలనంబి పేరు చెప్పినపుడు తిరుమలక్షేత్రం గుర్తుకు వస్తుంది. అట్టి అవినాభావ సంబంధం తిరుమలకి తిరుమలనంబికి ఉన్నది.
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండే తిరుమలలో స్వామివారి సేవలోనే తరించిన మహనీయులు తిరుమల నంబి. తిరుమల క్షేత్రంలో నివసించిన ప్రప్రథమ ఆచార్యుడిగా తిరుమల నంబిని పేర్కొనవచ్చు. 12 మంది ఆళ్వారులు భగవంతునిపై పాడిన నాలాయిర దివ్యప్రబంధ పాశురాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఆచార్యులు శ్రీమన్నాథమునులు. ఆయన మనవడు అయిన ఆళవందార్ల(యామునాచార్యుల)కు తిరుమల నంబి మనవడు. తిరుమల నంబి క్రీ.శ. 973లో తమిళ శ్రీముఖ సంవత్సరం పురట్టాసి నెలలో అనూరాధ నక్షత్రంలో జన్మించారు. తిరుమల నంబి తన జీవితాన్ని స్వామిసేవకే అంకితం చేశారు. సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీశ్రీనివాసుడు తిరుమలనంబిని తాతా అని పిలిచేవారట. ఈ తాతా అని పిలవడం వెనక ఉన్న ఓ కథనాన్ని మన పెద్దలు చెప్పారు. తిరుమలనంబి ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకం, ఇతర కైంకర్యాలకోసం ఆలయానికి దూరంగా ఉన్న పాపవినాశనం తీర్థం నుంచి నీటిని బిందెలతో తీసుకువచ్చేవారు. వయస్సు మీదపడినా తిరుమలనంబి అంతదూరం నుంచి నీటిని తీసుకురావడం చూసి స్వామికి బాధ కలిగింది. ఓరోజు తిరుమల నంబి పాపవినాశనం తీర్థం నుంచి స్వామికోసం నీటిని తీసుకువస్తుండగా, ఓ బాలవేటగాడు తిరుమలనంబి దగ్గరకు వచ్చి తాతా నాకు దాహం వేస్తోంది. మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగారు. దాంతో తిరుమలనంబి ఈ నీటిని స్వామి అభిషేకం కోసం తీసుకువెళుతున్నాను, నీకు ఇవ్వలేను అని చెప్పి ఆలయానికి బయలుదేరారు. అప్పుడు వెనక నుంచి ఆ బాలవేటగాడు తన బాణంతో ఆ మట్టిబిందెకు రంధ్రం వేసి మంచినీటిని తాగాడు. దీనిని చూసిన తిరుమలనంబికి ఎంతో బాధ కలిగింది. దీనిని గమనించిన ఆ బాలవేటగాడు దగ్గరలో ఉన్న ఓ కొండపై బాణాన్ని వేయగా, ఆ బాణం తగిలి అక్కడ నుంచి నీరు కిందికి వచ్చింది. ఆ బాలవేటగాడు శ్రీ వేంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చి ఈ నీటినే తన అభిషేకానికి తీసుకురావాల్సిందిగా తిరుమలనంబిని కోరినట్లు చెబుతారు. ఆ బాణం వేసిన చోటు నుంచి వచ్చిన నీటి ప్రదేశాన్నే ఆకాశగంగగా నేడు పిలుస్తున్నారు. స్వామివారు తిరుమలనంబిని తాతా అని పిలిచినందునే ఆ వంశీయులను తాతాచార్యుల కుటుంబీకులుగా పిలుస్తున్నారు.
ప్రతినిత్యం ఆకాశగంగ నుండి శ్రీవారి కైంకర్యానికి తీర్థం తీసుకొని వచ్చి భగవత్ కైంకర్యం నిర్విఘ్నంగా జరగడానికి తిరుమలనంబి నిర్విరామకృషి చేశారు. శ్రీవారి అనుగ్రహపాత్రులైనవారు కనుకనే తిరుమలనంబికి మాత్రం తిరుమల దేవాలయప్రాకారమాడవీధిలో సన్నిధి కూడా వెలసియున్నది. ఎప్పుడు శ్రీవారు బయట ప్రాకార సందర్శనకు వచ్చినా ఇచట హారతిని స్వీకరిస్తారు. అలాగే అన్ని ఉత్సవాలలోను వేదపారాయణం, దివ్యప్రబంధ ఆరంభం ఈ సన్నిధికి ప్రక్కనే ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీభూసమేతుడైన మలయప్పస్వామి అధ్యయనోత్సవాలు అయిన పిదప తిరుమలనంబి సన్నిధికి విచ్చేసి తిరుమలనంబివారిని అనుగ్రహించడం జరుగుతున్నది.
వాల్మీకీ రచించిన శ్రీమద్రామాయణంలోని శరణాగతి తత్వాన్ని భగవద్రామానుజులకు తిరుపతిలోని అలిపిరి వద్ద తిరుమలనంబి ఉపదేశించారు. రామానుజులవారు తిరుమల నంబికి మేనల్లుడు. తిరుమల క్షేత్ర సంపదాయాన్ని, ఆగమాన్ని, సదాచారాలను రామానుజులవారితో కూడి సువ్వవస్థితపరిచినవారు తిరుమలనంబివారే. ఇప్పుడు తిరుమలనంబి వంశీయులు ట్రస్ట్‌గా ఏర్పడి ఎన్నో భగవత్ భాగవత ఆచార్య కైంకర్యాలను, సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.
– ఆచార్య డా. చక్రవర్తి రంగనాథన్