Paramparaa – The Tradition Continues…

శ్రీనివాసుడు బహిర్గతం చేసిన అన్నమయ్య కీర్తనలు

ఈరోజు మనం ఇన్ని అన్నమయ్య కీర్తనలు పాడుకుంటున్నాము అంటే ఇవి లోకానికి తెలియ చేసింది పరోక్షంగా శ్రీనివాసుడు…ప్రత్యక్షంగా మహానుభావులు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారూనూ… 1889 డిసెంబర్ లో జన్మించిన   శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహంత్ ప్రయాగ్ దాస్ వారి వద్ద సహాయకులుగా వుండే వారు…వీరు epigraphy లో ట్రైనింగ్ తీసుకుని తిరుమల ఆలయం లోని అనేక శాసనాలను ఇంగ్లీష్ లోకి తీసుకు వచ్చారు..ఆరోజుల్లో తిరుమల ఆలయం మహంతుల ఆధీనం లో ఉండేది.

శ్రీ శాస్త్రి గారు ఆలయం లోకి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రతీ సారి ఆలయం లో ఒక రాతి అర ను చూసేవారు…దానిపై శ్రీ అన్నమాచార్యులు , శ్రీ పెద తిరుమలాచార్యులు  చెక్కి ఉండేవారు…చిన్న తలుపులు ఉన్న ఆ అరను ఒక గుడ్డ పీలిక తో కట్టేసి ఉంచేవారు…అందుకని ఆ అరను   ‘ చిలకమూరు ‘ అని పిలిచేవారు…అందులో ఏముందో ఎవ్వరూ పట్టించు కునే వారు కారు…లోపలికి చూసినా ఏమీ కనపడేది కాదు…. ఎవ్వరు పట్టించు కొక పోయినా ఆ సమయం రాగానే ఆ శ్రీనివాసుడు మాత్రం తప్పక పట్టించు కుంటాడు కదా !…అందులోనూ తనకు అన్నమాచార్యుల వారూ , వారి కీర్తనలూ అంటే ఎంతో ప్రాణం కదా !

శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రోజూ స్వామి దగ్గరికి వెళ్తూ వస్తూ ఈ అరను ఉత్సుకతతో చూసేవారు…ఇక లాభం లేదు అనుకుని ఒక రోజు ఆ చెక్క తలుపులు తీసి లోపలికి చూసారు…అంతా చీకటి మయం…ఏమీ కనపడలేదు…ఎంతో నిరుత్సాహ పడ్డారు…అయినా రోజూ అటే చూస్తూ స్వామి వారే ఎదో నాడు చెప్తారులే అనుకునే వారు…

అత్యంత కరుణామయుడు అయిన మన స్వామి వారు ఇంక ఆలస్యం చెయ్య దలుచు కోలేదు…ఒకనాడు శాస్త్రి గారికి శ్రీనివాసుడు కలలో కనపడి నాయనా ! శాస్త్రీ ! నువ్వు రోజూ ఆ అర లోకి చూస్తున్నావు కదా…ఏమీ కనిపించ టల్లేదు కదా…రేపు అక్కడ రాతి పీఠం పైన ఉన్న రాతి బండను పక్కకి జరిపి చూడు…లోపల ఏముందో నీకే తెలుస్తుంది…’ అని అంతర్ధానం అయ్యాడు…

ఉదయాన్నే లేచిన శాస్త్రీ గారు మహా హుషారుగా ఆలయం లోకి వెళ్లి  చిలక మూరు అర లోని రాతి బండను పక్కకి తొలగించారు…అంతే లోపల ఉన్నవి చూడగానే శాస్త్రీ గారి వొళ్ళు జలదరించింది….అనేక రాగి రేకులు శాస్త్రీ గారి కి కనిపించాయి …వాటిని కళ్ళకు అద్దుకుని చూసారు…అవన్నీ అన్నమాచార్యులు వారు , వారి వంశస్థులు రచించిన కీర్తనలు…శాస్త్రీ గారు శ్రీనివాసునికి నమస్కరించి వాటిని భద్రం గా ఆలయ పాలకులకు అప్పగించారు…ఈ అరనే ప్రస్తుతం తాళ్ళపాక అర గా పిలుస్తున్నారు.

ఇలా ఆనాడు సాక్షాత్తూ శ్రీనివాసుని ప్రేరణ తో , అనుగ్రహం తో  శ్రీ శాస్త్రీ గారి ద్వారా అన్నమాచార్య కీర్తనలు  అవి రాయబడ్డ 400 సంవత్సరాలకి  లోకానికి తిరిగి బహిర్గతమయ్యాయి…శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవితం ధన్యం అయ్యింది…వీరు తర్వాత కాలం లో తిరుమల శాసనాలు అన్నింటినీ ఇంగ్లీష్ లోకి తీసుకు వచ్చారు… ప్రాతః స్మరణీయులు అయిన   వీరి గురించి వివరంగా మరో సారి చదువు కుందాము…

ఆ తర్వాత ఈ అన్నమయ్య కీర్తనలు అన్నింటినీ మహానుభావులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు , శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గార్లు పరిష్కరించి మన అందరికీ అందించారు… అటు తర్వాత.  శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు  మంగళం పల్లి వారు , శ్రీ నేదునూరి వారు ,  శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు , శ్రీమతి శోభా రాజు గారు వంటి అనేక మంది మహానుభావుల కృషి వలన అన్నమాచార్య సంకీర్తనలు ఎన్నో నేడు ప్రజా బాహుళ్యం లోకి వచ్చాయి…ఇదే అన్నమాచార్య కీర్తనల కధ…ఇది చదివిన మన అందరికీ ఆ శ్రీనివాసుని అనుగ్రహం తప్పక ఉంటుంది….

శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు

Viswapathi

E-Mail : [email protected]

pH: 9849443752

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour