Paramparaa – The Tradition Continues…

శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలకు ముస్తాబవుతున్న నెల్లూరు

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే  శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది.
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు.
నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది. 1887లోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. నెల్లూరు పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఎదురుగా కేవలం వందగజాల దూరంలో శ్రీ వేదాంతదేశికుల వారి ఆలయం కనిపిస్తుంది. అలాగే శ్రీ ఆదివణ్‌ శఠకోప యతీర్రద మహాదేశికులవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఆలయంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుట్లో అహోబిలమఠం వారు ఆలయ నిర్మాణంకోసం ఈ ప్రాంతాన్ని విరాళంగా ఇచ్చారు. దాంతో భక్తులంతా కలిసి 1887 ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
శ్రీ వేంకటేశ్వరుని ఘంటావతారంగా కొనియాడే శ్రీ వేదాంతదేశికులను ఘంటా రూపంలో ప్రతిష్టించారు. దాదాపు ఐదు టన్నుల బరువు ఉన్న ఘంటామూర్తి అందరినీ ఆకట్టుకుంటూ, భక్తుల పూజలను అందుకుంటోంది. శ్రీ వేదాంత దేశికులవారికి ప్రతి ఏటా తమిళనెల పురటాశి మాసంలో వేదాంతదేశికులవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ మాసంలోనే శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీర్రద మహాదేశికుల వారికి కూడా ఉత్సవాలను వైభవంగా జరుపుతారు.
ఈసారి ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికులవారి ఉత్సవాలు సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు వైభవంగా జరగనున్నది. శ్రీ నిగమాంత మహాదేశికులవారి ఉత్సవాలను సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీలు, సభ్యులు, అర్చకులు, పెద్దలు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. అందరూ ఈ ఉత్సవాలకు వచ్చి ఆచార్యులవారి కరుణ కటాక్షాలను పొందాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour