Paramparaa – The Tradition Continues…

కమనీయం సీతారాముల కళ్యాణం…

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం!

సీతాపతిం రఘుకులాన్వయ రత్నద్వీపం

ఆజానుబాహు అరవింద దళాయతాక్షం!

రామం నిశాచర వినాశకరం నమామి!!

అంటూ దివ్యపురుషుణ్ణి భక్తి మనస్సుతో ఆరాధించుకునే పుణ్యప్రదమైన రోజు శ్రీరామనవమి. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. చైత్ర శుద్ధ నవమి. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు. చిత్రమేమిటంటే ఆ పుట్టినరోజే అంటే ఆయా తిథి వార నక్షత్రాల్లోనే ఆయనకు వివాహం జరిగింది. పట్టాభిషేకం జరిగిన శుభసమయం కూడా ఇదే కావడం విశేషం. దీంతోపాటు జగదేకమాత సీతాదేవి తన కళ్యాణప్రదమైన చూపులతో లోకాన్ని సందర్శించే మహత్తర మహిమాన్వితమైన రోజు కూడా ఈరోజే. ఈరోజు భద్రాచలక్షేత్రం మిథిలానగరాన్ని తలపిస్తుంది. వేదోక్త మంత్రాల మధ్య జరిగే ఈ సీతారాముల కల్యాణ వైబోగం తవినితీరా చూడాల్సిందే.

శ్రీరాముడు ఆదర్శమూర్తి. ‘రామో విగ్రహవాన్‌ ధర్మ’ అన్నట్లు రూపుదాల్చిన ఆ శ్రీరాముని ఆదర్శంతో మానవాళి జీవిస్తే విశ్వంలో అశాంతికి చోటు ఉండదు. మన పూర్వులు రామనామాన్ని మన జీవనవిధానంలో చేయడం కూడా ఇందుకోసమే. ఊరూరా రామమందిరాలు నెలకొల్పి నోరారా రామనామాన్ని పలికేలా మన సంప్రదాయాలను సృష్టించారు. వాడవాడలా రామాలయాలు ఎన్ని ఉన్నా ముఖ్యమైన రామాలయ క్షేత్రాలుగా అగస్త్య సంహిత పురాణంలో పేర్కొన్న స్థలాలు మాత్రం 14. వాటిలో అయోధ్య మొదటిది, రెండవది మన రాష్ట్రంలోని భద్రాచల క్షేత్రం. భద్రాచలంలో కొలువైన శ్రీరామచంద్రుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన శ్రీమహావిష్ణువు. చతుర్భుజాలు, శంఖుచక్రాలు ధరించి కొలువైన పట్టాభిరాముడు. వనవాసానికి వెళుతూ దందకారణ్యంలో ఒక రాయిపై సేద తీరిన శ్రీరాముడిని తనపై శాశ్వతంగా నిలుపుకోవాలని భద్రుడు ఆశపడుతాడు. అందుకు సరేనన్న రాముడు తిరుగు ప్రయాణంలో కోరిక చెల్లిస్తానంటాడు. అంతవరకు రామభద్రునికోసం భద్రుడు తపస్సు చేస్తాడు. చివరకు భద్రుని కోరికను మన్నించి శ్రీరాముడు అతనికి సాక్షాత్కరిస్తాడు.

స్వామి అనుగ్రహంతో ఒక అచలం (కొండ)గా మారగా, ఆ కొండ శిఖర భాగంపై శ్రీరాముడు తన పాదముద్రలను ఉంచుతాడు. శ్రీరాముడు భద్రుని శిరస్సుపై పాదాలు మోపిన భాగం శిరస్థానమని, స్వామి కొలువై ఉన్న చోటు హృదయస్థానమని, రాజగోపురం ఉన్నచోటు పాదస్థానమని అంటారు. ప్రస్తుతం ఆదివారం తప్ప మిగతారోజుల్లో భద్రుని శిరస్సు, శ్రీరామపాదాలకు నిత్యం అభిషేకం జరుగుతుంది.

 భద్రుని కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రామచంద్రునిగా శంఖుచక్రాలు, ధనుర్భాణాలతో ఇక్కడ అవతరించారని ఐతిహ్యం. శ్రీ మహావిష్ణువు రామునిగా, శ్రీ మహాలక్ష్మి సీతగా, శేషుడు లక్ష్మణునిగా, శంఖుచక్రాలు భరత, శత్రుఘ్నులుగా ఇక్కడ కనిపిస్తారు. అందుకే ఏ ఇతర రామాలయాల్లో లేని ప్రత్యేకత ఈ భద్రాచలరామాలయానికి ఉంది.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour