Paramparaa – The Tradition Continues…

కవితార్కిక సింహుని ఉత్సవాలకు నెల్లూరు ముస్తాబు

నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు. శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది.

నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది. 1887లోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. నెల్లూరు పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఎదురుగా కేవలం వందగజాల దూరంలో శ్రీ వేదాంతదేశికుల వారి ఆలయం కనిపిస్తుంది. అలాగే శ్రీ ఆదివణ్‌ శఠకోప యతీర్రద మహాదేశికులవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఆలయంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుట్లో అహోబిలమఠం వారు ఆలయ నిర్మాణంకోసం ఈ ప్రాంతాన్ని విరాళంగా ఇచ్చారు. దాంతో భక్తులంతా కలిసి 1887 ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. శ్రీ వేంకటేశ్వరుని ఘంటావతారంగా కొనియాడే శ్రీ వేదాంతదేశికులను ఘంటా రూపంలో ప్రతిష్టించారు. దాదాపు ఐదు టన్నుల బరువు ఉన్న ఘంటామూర్తి అందరినీ ఆకట్టుకుంటూ, భక్తుల పూజలను అందుకుంటోంది. శ్రీ వేదాంత దేశికులవారికి ప్రతి ఏటా తమిళనెల పురటాశి మాసంలో వేదాంతదేశికులవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ మాసంలోనే శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీర్రద మహాదేశికుల వారికి కూడా ఉత్సవాలను వైభవంగా జరుపుతారు.
ఈసారి ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికులవారి ఉత్సవాలు సెప్టెంబర్‌ 29 నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 7వ తేదీ వరకు జరగనున్నాయి. అక్టోబర్‌ 3వ తేదీన శ్రీ వేదాంత దేశికులవారికి సింహవాహన సేవ జరుగుతుంది. 4వ తేదీన హంసవాహనం, 5వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. గరుడసేవ, తిరుచ్చి ఉత్సవాలు జరుగుతాయి. 6వ తేదీన శ్రీ వేదాంత దేశికులవారు యాళివాహనంపై ఊరేగుతారు. 7వ తేదీన ముత్తంగి వాహనం, తిరుచ్చివాహన సేవ జరుగుతుంది. 8వ తేదీన శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీంద్రుల మహాదేశికుల తిరునక్షత్ర మహోత్సవం జరుగుతుంది. పల్లకీ సేవ ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, ఆదివణ్‌ శఠగోప స్వామివారికి పేటోత్సవం, శాత్తుమొరై జరుగుతుంది. 9వ తేదీ సాయంత్రం శ్రీమద్‌ వేదాంత దేశికులవారికి చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. 10వ తేదీన గజవాహనం, 11వ తేదీన అశ్వవాహనం, 12వ తేదీన శ్రీమద్‌ వేదాంత దేశికులవారి తిరునక్షత్ర మహోత్సవం, పల్లకీ సేవ ఉంటుంది. సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పేటోత్సవం, శాత్తుమొరై జరుగుతుంది. ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీలు, సభ్యులు, అర్చకులు, పెద్దలు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అందరూ ఈ ఉత్సవాలకు వచ్చి ఆచార్యులవారి కరుణ కటాక్షాలను పొందాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour