ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అహోబిలమఠంలో ఏర్పాటు చేసిన తిరుప్పావై ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా మొదటి పాశురం విశిష్టతను శ్రీరంగంలోని పౌండరీకపురం ఆండవన్ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి భక్తులకు సులభమైన రీతిలో తెలియజేశారు. పౌండరీకపురం ఆశ్రమం విశిష్టమైన మునిత్రయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, భగవద్ రామానుజుల, స్వామి దేశికుల బోధనలను ప్రచారం చేస్తోంది. స్వామివారి హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని అహోబిలమఠం నిర్వాహకులు వారి తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేదాంతం, వ్యాకరణం మరియు తర్క శాస్త్రాలలో నిష్ణాతులైన శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశిక స్వామి భగవంతుని వైభవాన్ని గోదాదేవి పాశురముల ద్వారా తెలియజేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి సన్యాస దీక్షకు ముందు ప్రముఖ పండితుల వద్ద వివిధ శాస్త్రాలను అధ్యయనం చేశారు. కాంచీపురంలో న్యాయ విద్వాన్ తిరుమలై చతుర్వేద శతక్రతు శ్రీ నరసింహ తాతాచార్య స్వామి వద్ద శ్రీభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, గద్యత్రయం, అధికరణ సారావళి, శ్రుత ప్రకాశిక మొదలైనవాటిపై కాలక్షేపం (శాస్త్ర అధ్యయనం) చేశారు. అలాగే కుడవాసల్ ‘‘శ్రవణదీపం’’ శ్రీ శ్రీనివాస గోపాలాచార్య స్వామి నుండి వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం వంటి గ్రంథములలో విశేషమైన శిక్షణ పొందారు. శ్రీరంగంలో పౌండరీకపురం ఆశ్రమానికి 9వ ఆచార్యులు అయిన రాయపురం ఆండవన్ స్వామికి అంతరంగ కైంకర్యం చేస్తూ విగ్రహారాధన క్రమము, అలాగే సన్యాస అనుష్ఠాన క్రమాలను అభ్యసించారు. అదే సమయంలో ఆయన నుండి ప్రేష మంత్ర ఉపదేశాన్ని పొందారు. శిష్యులు, శ్రీకార్యం (ఆశ్రమము యొక్క కార్యనిర్వహణాధికారి) విజ్ఞప్తి మేరకు, ఆయన విలంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం నాడు (3 జూన్ 2018) సన్యాసాన్ని స్వీకరించి, పౌండరీకపురం ఆశ్రమానికి 10వ ఆచార్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఆశ్రమ పీఠాధిపతిగా వివిధ దివ్యదేశాలను సందర్శించి మంగళాశాసనములు చేస్తూ, ప్రవచనాల ద్వారా భక్తులకు సన్మార్గాన్ని, సనాతన ధర్మము యొక్క విశిష్టతను చాటిచెపుతున్నారు.



