Paramparaa – The Tradition Continues…

పుణ్యమార్గం చూపించే ధనుర్మాసం

మార్గశిరం మాసం వచ్చింది…ఈనెలనే ధనుర్మాసం అని కూడా అంటారు. భగవంతునికి ఈనెల ఎంతో ఇష్టమైంది. స్వయంగా శ్రీ కృష్ణపరమాత్ముడే భగవద్గీతలో ఈ విషయాన్ని మాసానాం మార్గశీర్షోహం అంటూ సెలవిచ్చారు. ఆధ్యాత్మిక చింతన, మధురభక్తికి ప్రతీకగా ధనుర్మాసం నిలుస్తుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటి నుంచి మకరరాశిలో ప్రవేశించేవరకు ఉన్న నెలరోజుల కాలమే ధనుర్మాసం. ఈనెలలో విష్ణుమూర్తికోసం చేసే చిన్న పూజ అయినా పెద్దఫలాన్నే ఇస్తుందని చెబుతారు. ఈ మాసానికి అంత ప్రభావం ఉంది. ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ వ్రతం చేస్తారు. తిరుప్పావై అనగా శ్రీ వ్రతమని కూడా అర్థం. ఈ తిరుప్పావైని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశమైన గోదాదేవి పఠించారు. అందుకే ఆమెను తిరుప్పావై కోదై అని పిలుస్తారు. భక్తితో ఆమె తన స్వామి అయిన శ్రీ రంగనాయకుడిని పాశురాలతో కీర్తించింది. విజయనగర మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలు ఈ గోదాదేవి కథనే ‘ఆముక్త మాల్యద’ పేరుతో ఓ కావ్యాన్ని రాశాడు. ‘ఆముక్తమాల్యద’ అంటే తను ధరించిన పుష్పమాలలను స్వామికి సమర్పించినదని అర్థం. తమిళంలో ఆమెను ‘చూడికొడుత్త నాచ్చియార్‌’ అని పిలుస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే ‘తిరుప్పావై’ పాశురాలను పాడుతూ అమ్మవారైన గోదాదేవికి పొంగళ్ళను సమర్పిస్తారు. దేవదేవుడిని కీర్తించిన వైష్ణవులైన 12 మంది ఆళ్వారులలో ఒకరిగా ఆండాళ్‌ అమ్మ వారు గుర్తింపును పొందింది. ఈ ఆళ్వారు లలో ప్రముఖుడైన పెరియాళ్వార్‌ అనే విష్ణుచిత్తునికి తులసీవనంలో ఓ బిడ్డ ఏడుస్తూ కనిపించింది. దీంతో పెరియా ళ్వార్‌ ఆమెకు ‘కోతై’ అని పేరు పెట్టారు. పుష్పవనములో దొరికినందువల్ల ఆమెకు ఆ పేరును విష్ణుచిత్తుడు పెట్టారు. తమిళమున కోతై అంటే మాలిక అని అర్థం. కోతై పేరును సంస్కృతంలో గోదా గా మార్చారు. గో శబ్దమునకు భూదేవి అని అర్థం.

విష్ణువు మీదే నిరంతరం చిత్తాన్ని నిలిపి ఉంచారు కనుక ఆయనకు విష్ణుచిత్తుడని నామము వచ్చింది. కారణజన్మురాలైన దేవి, ఆయన ఇంట అల్లారుముద్దుగా, ఎంతో అందంగా పెరిగింది. బాల్యం నుంచి శ్రీ కృష్ణుని గాథలను వింటూ, వాటిని తన మనస్సులో నిలుపుకోవడమే కాకుండా తనను కూడా ఓ గోపికగా ఊహించుకుని బృందావనంలో తాను ఆ కృష్ణునితో విహరిస్తున్నట్లుగా భావించి పాశురాలు రాసింది. ఆ పాశురాల్లో శ్రీ కృష్ణుని లీలావిన్యాసాలు మనకు కనిపిస్తాయి.

ప్రతిరోజు విష్ణుచిత్తుడు పుష్పవనంలోని పూలను మాలగా చేయించి శ్రీరంగనాథునికి అర్పించేవారు. అయితే ఈ మాలను కట్టిన తరువాత అది తన నాయకుడైన శ్రీ రంగనాధునికి సరిపోతుందే లేదోనని గోదాదేవి ధరించి అద్దంలో చూసుకుంటున్నది. ఒకరోజు ఇలా చేస్తున్న సమయంలో విష్ణుచిత్తుడు ఇది చూసి దేవునికి ఇచ్చేముందు మనిషి ధరించడం అపచారమని తలంచారు. ఆరోజు గోదాదేవి వేసుకున్న మాలను తీసేసి వేరే మాలను శ్రీరంగనాథునికి అర్పించారు. అయితే ఆరోజు రాత్రి శ్రీరంగనాధుడు విష్ణుచిత్తునికి కలలో కనిపించి తనకు గోదాదేవి ధరించిన మాలనే ఇష్టమని చెప్పారు. దాంతో పరమానందభరితుడైన విష్ణుచిత్తుడు తరువాతిరోజు తన కుమార్తె గోదాదేవి వెంట తీసుకుని వెళ్ళి శ్రీరంగనాధుడిని దర్శించారు. ఈ సందర్భంగా రంగనాథుడు ప్రత్యక్షమై గోదాను తానే వివాహం చేసుకుంటానని ఆమె అందుకోసమే పుట్టిందని తెలిపారు. దీంతో విష్ణుచిత్తుడు సంతోషంతో తన కుమార్తె అయిన గోదాదేవిని శ్రీరంగనాయకుని ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు.

    ధనుర్మాసంలో గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆమె రాసిన పాశురాలనే ‘తిరుప్పావై’ అని అంటారు. నెలరోజులపాటు ఆమె స్వామివారిని పాశురాలతో కీర్తించింది. తాను రచించిన పాశురాలతో స్వామిని సేవించుకుంటే వారికి కూడా పుణ్యంతోపాటు మార్గళి లేదా మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో తరించే మార్గం ఏర్పడుతుందని మనకు తెలిపింది. ధనుర్మాసంలో మహిళలు తొలిజామునే లేచి ముత్యాల ముగ్గులను తమ ఇంటి ముందు వేస్తారు. కోరిన కోర్కెలు తీర్చడమే కాకుండా సర్వకార్య సిద్ధిని కలించే ఈ ప్రతాన్ని మహిళలు ఆచరించాలని మన పెద్దలు చెబుతారు.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour