కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 10 రోజులపాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవల సమయంలో ఆళ్వారులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయనున్నారు. ఏ ఏ వాహనసేవల్లో ఏ ఆళ్వారులు అనుగ్రహించిన ప్రబంధాన్ని గానం చేస్తారన్న విషయంపై తిరుపతి పండితులు, ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ స్వామి పరంపర భాగవతోత్తములకోసం తమ వ్యాఖ్యానం ద్వారా అందించారు.
బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా పొయ్గై ఆళ్వార్ అనుగ్రహించిన ముదల్ తిరువందాడి పాశురాలను పారాయణం చేస్తారు. తరువాత పెరియాళ్వార్ అనుగ్రహించిన పెరియాళ్వార్ తిరుమొళి నుంచి 20 పాశురాలు చెబుతారు. మరుసటిదినం బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం చిన్నశేషవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భూదత్తాళ్వార్ అనుగ్రహించిన 2వ తిరువందాడి పాశురాలను పారాయణం చేస్తారు. తరువాత పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. అదేరోజు రాత్రి స్వామివారు హంసవాహనంపై ఊరేగింపుగా మాఢవీధుల్లో దర్శనమిస్తారు. భూదత్తాళ్వార్ అనుగ్రహించిన 2వ తిరువందాడి పాశురాలను పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. 3వ రోజు ఉదయం సింహవాహనంపై యోగనృసింహ రూపంలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా పేయాళ్వార్ అనుగ్రహించిన మూడవ తిరువందాది పాశురాలను, పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. రాత్రి ముత్యపుపందిరపై స్వామివారు కనువిందు చేస్తారు. ఈ సందర్భంగా పేయాళ్వార్ అనుగ్రహించిన మూడవ తిరువందాది పాశురాలను, పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. నాలుగవ రోజు ఉదయం కల్పవృక్షవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీనివాసుడు భక్తులకు సాక్షాత్కారమిస్తారు. ఈ సందర్భంగా తిరుమళిశై ఆళ్వార్ పాడిన నాన్ముగన్ తిరువందాడి పాశురాలను, పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. అదేరోజు రాత్రి సర్వభూపాలవాహనంపై స్వామివారు చక్రవర్తి రూపంలో కనువిందు చేస్తారు. ఈ సందర్భంగా తిరుమళిశై ఆళ్వార్ పాడిన నాన్ముగన్ తిరువందాడి పాశురాలను, పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. 5వ రోజు ఉదయం మోహినీ అవతారంలో పల్లకిరూపంలో తిరువీధుల్లో ఊరేగుతారు. నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువిరుత్తం పాశురాలను పారాయణం చేస్తారు. తరువాత పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను పాడుతారు. అదేరోజు రాత్రి విశేషమైన గరుడవాహనంపై స్వామివారు విశేష అలంకారములతో భక్తులకు సాక్షాత్కారమిస్తారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువిరుత్తం పాశురాలను పారాయణం చేస్తారు. తరువాత పెరియాళ్వార్ తిరుమొళి నుంచి పాశురాలను సేవిస్తారు. 6వ రోజు ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు సాక్షాత్కరిస్తారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ పాడిన పెరియ తిరువందాడి పాశురాలను పెరియాళ్వార్ తిరుమొళి నుంచి కొన్ని పాశురాలను, రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై భక్తులకు రాజులాగా సాక్షాత్కరించనున్నారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ పాడిన పెరియ తిరువందాడి పాశురాలను పెరియాళ్వార్ తిరుమొళి నుంచి పాశురాలను పాడి పూర్తి చేస్తారు. 7వరోజున స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్ పాడిన పెరియతిరుమొళి నుంచి 80 పాశురాలను పారాయణం చేస్తారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగింపుగా మాఢవీధుల్లో తీసుకువస్తుంటే తిరుమంగై ఆళ్వార్ పాడిన పెరియతిరుమొళిలోని 90వ పాశురం నుంచి కొన్ని పాశురాలను పారాయణం చేస్తారు. 8వ తేదీ ఉదయం స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్ పాడిన పెరియతిరుమొళిలోని మిగిలిన పాశురాలను పారాయణం చేస్తారు. తరువాత కోయిల్ తిరుమొళి నుంచి పాశురాలను పాడి పెరియతిరుమొళి పాశురాలను పూర్తి చేసేస్తారు. తిరువాశిరియుమ్ పాశురాలు, శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ పాశురాలను పారాయణం చేస్తారు. రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో రూపంలో దర్శనమిస్తారు. ఆండాళ్ అనుగ్రహించిన నాచ్చియార్ తిరుమొళి పాశురాలను పాడుతారు. మరుసటిరోజు చక్రస్నానం జరుగుతుంది. ఈ సందర్భంగా తెల్లవారుజామున పల్లకిసేవ జరుగుతుంది. ఈ సందర్భంగా కులశేఖరాళ్వార్ పాడిన పెరుమాళ్ తిరుమొళి పాశురాలను పారాయణం చేస్తారు. తిరుమళిసై ఆళ్వార్ పాడిన తిరుచ్ఛన్దవిరుత్తమ్, తొండరడిప్పొడి ఆళ్వార్ పాడిన తిరుమాలై, తిరుప్పళ్ళి యెళుచ్చి, తిరుప్పాణాళ్వార్ పాడిన అమలనాదిపిరాన్, మధురకవి ఆళ్వార్ పాడిన కణ్ణినుణ్ శిరుత్తంబు పాశురాలతో ముదలాయిరం పూర్తవుతుంది. తరువాత తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తిరుక్కురుడాండకం, తరువాత చక్రస్నానం తరువాత తిరుప్పావై, తిరుప్పళ్ళియొళుచ్చి, ఇరామానుశనూత్తన్రాది పాశురాలను పాడుతారు. రాత్రి జరిగే ఊరేగింపులో తిరువరంగత్తముదనార్ పాడిన ఇరామానుశనూత్తన్రాది పాశురాలను సేవిస్తారు.
ఇలా వాహన సేవల్లో ఆళ్వారులు పాడిన పాశురాలను పారాయణం చేస్తారు.