Paramparaa – The Tradition Continues…

దివ్యక్షేత్రాల్లో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో లోకాన్ని ఉజ్జీవింపజేయడానికి, భక్తులను సన్మార్గాన నడపడానికి ఆచార్యులను అవతరింపజేశాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా శ్రీమద్ వేదాంత దేశికులు అవతరించారు. కవితార్కిక సింహులు, సర్వతంత్ర స్వతంత్రులు అనే బిరుదాంకితులైన ఆయన దాదాపు 120కి పైగా గ్రంథాలను రచించడంతోపాటు భక్తులు సులభంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకునేలా వివిధ స్తోత్రాలను రచించారు.  కాంచీపురంలోని తూపుల్ అనే అగ్రహారంలో అనంతసూరి మరియు తోతారంబ దంపతులకు భాద్రపద మాసంలో (శ్రవణ నక్షత్రాన) దేశికులు అవతరించారు. ఆయన అవతార దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ దివ్యక్షేత్రాల్లో ఉన్న శ్రీ వేదాంత దేశికులవారికి పదిరోజులపాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆయన అవతార స్థలమైన తూపుల్ దివ్యక్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

తిరువహీంద్రపురంలో….
తమిళనాడులోని కడలూరు సమీపంలో ఉన్న తిరువహీంద్రపురంలో కూడా శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ దేశికుల వారికి 12 రోజుల పాటు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ వివిధ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. దేవనాయక పంచాశత్ ఉత్సవం, గరుడ పంచాశత్ ఉత్సవం, పరమతభంగ ఉత్సవం, గోపాల వింశతి ఉత్సవం, రఘువీరగద్య ఉత్సవం, శ్రవణ నక్షత్రం నాడు హయగ్రీవ స్తోత్ర ఉత్సవం/రత్నాంగి సేవ వంటివి ఇందులో ముఖ్యమైనవి.


తిరునారాయణపురం (మేల్ కోట్టై)లో…
మేల్కోటై (తిరునారాయణపురం) దివ్యక్షేత్రంలో కూడా శ్రీ వేదాంత దేశికులవారికి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామానుజుల వారితో పాటు ఉభయ నాచ్ఛియార్లతో శ్రీ శెల్వపిళ్ళై సంపత్కుమార స్వామి వేదాంత దేశికుల సన్నిధికి రావడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత అని చెప్పవచ్చు.


నెల్లూరులో…
తల్పగిరి రంగనాథ స్వామి వెలసిన నెల్లూరు క్షేత్రంలో వేదాంత దేశికుల వారి 758వ వార్షిక అవతార మహోత్సవాలను వివిధ వాహన సేవల ద్వారా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ వాహనాలపై శ్రీ వేదాంత దేశికులవారి ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాలను నిర్వహిస్తారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న పొమానలోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో కూడా శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల వివరాలను తిరుపతిలోని ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాధన్ గారు ఈ వీడియో ద్వారా వివరించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శ్రీ వేదాంత దేశికుల ఉత్సవ పత్రికలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour