శ్రీవైష్ణవ సంప్రదాయానికి, ముఖ్యంగా దేశిక సంప్రదాయ ప్రవచనానికి శ్రీ సేవా స్వామి చేస్తున్న సేవను వారి వంశీయులు సేవా ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వేదాంత దేశికులవారు రచించిన శ్రీ గోదాస్తుతి పుస్తకాన్ని నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి దేవాలయంలో మార్చి 7వ తేదీన జరిగిన కార్యక్రమంలో వైభవంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సేవాస్వామి తెలుగువ్యాఖ్యానాన్ని అందించారు. ప్రముఖ పండితులు, తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌గారు పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ముఖ్యంగా దేశిక సంప్రదాయాన్ని అందరికీ తెలియజేసేందుకు శ్రీ సేవా స్వామి చేసిన కృషిని కొనియాడారు. సేవా ట్రస్ట్ పేరుతో వారి వంశీయులు ఈ దేశిక సంప్రదాయాన్ని విస్తరించేందుకు పాటుపడుతున్నారని చెప్పారు. తెలుగులో ఉన్న ఈ పుస్తకాన్ని నెల్లూరులో శ్రీ వేదాంత దేశికులవారి దేవాలయంలో ఆవిష్కరించడం సముచితమని అంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించిన శ్రీ రామదొరైని, శ్రీ జానా తదితరులను ఆయన అభినందించారు.