శ్రీరంగంలోని దేశికర్ సన్నిధిలో జరిగిన శ్రీ నాథమునుల 1200వ తిరునక్షత్ర మహోత్సవంలో శ్రీ పౌండరీకపురం ఆండవన్ స్వామివారు పండితులను ఘనంగా సన్మానించారు. తిరుపతికి చెందిన కంభరాజపురం మురళీ అయ్యంగార్‌ను అధ్యాపకరత్న చూడామణి అవార్డుతో, తిరుమలనంబి వంశీయులైన టి.కె. ముకుందన్‌ను ఆచార్య కైంకర్యరత్నచూడామణి అవార్డుతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వివిధ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో ఆండవన్ స్వామి మాట్లాడుతూ, నాధమునులు పెరుమాళ్ళకు చేసిన కైంకర్యం, వైష్ణవలోకానికి చేసిన సేవలను తెలియజేశారు.
తిరుపతిలోని ప్రముఖ పండితులు దివ్యప్రబంధరత్న, దేశిక సంప్రదాయదురంధర శ్రీ ఉ.వే. కీ.శే. తోళప్ప కంభరాజపురం శేషాద్రి స్వామివారి శిష్యులలో ఒకరైన మురళీ అయ్యంగార్ తిరుపతిలోనూ, తిరుమలలోనూ ఇతర చోట్ల జరిగే ఉత్సవాలలో దివ్య ప్రబంధగానం చేస్తున్నారు. ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల శ్రీ. ఉ.వే. చక్రవర్తి రంగనాథన్ స్వామి, ఇతర కంభరాజపురం స్వామి శిష్యులు, ఇతర ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పరంపర.ఇన్ వెబ్ సైట్ నిర్వాహకుల్లో ఒకరిగా కూడా కంభరాజపురం మురళీ అయ్యంగార్ ఉన్నారు.
తిరుమలనంబి వంశీయుడిగా శ్రీ వేంకటేశ్వరస్వామికి అనునిత్యం కైంకర్యం చేస్తూ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా టి.కె. ముకుందన్ పేరుగాంచారు.