Paramparaa – The Tradition Continues…

వైభవంగా జరిగిన పరంపర వెబ్‌సైట్‌ వార్షికోత్సవం

గత సంవత్సరం గరుడపంచమి రోజున ప్రముఖ పండితులచేత శాస్త్రోక్తంగా ప్రారంభించిన ‘పరంపర’ వెబ్‌సైట్‌ వార్షికోత్సవ సంబరాలను డిసెంబర్‌ 3వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆన్‌ లైన్‌ వేదికగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ప్రముఖ పండితులు పాల్గొని పరంపర.ఇన్‌ వెబ్‌ సైట్‌ ఈ ఏడాదికాలంలో చేసిన విజయాలను ప్రశంసిస్తూ, భవిష్యత్తుల్లో మరిన్ని కార్యక్రమాలతో వైష్ణవులను అలరించాలని ఆశీర్వదించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా న్యూయార్క్‌లోని పొమానా రంగనాధ స్వామి టెంపుల్‌ జీయర్‌ స్వామి శ్రీమద్‌ పరమహంస శ్రీ శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి, ప్రవచన వాచస్పతి శ్రీ ఉ.వే. అనంత పద్మనాభచారియార్‌ హాజరయ్యారు. అతిధులుగా శ్రీ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి (తిరుపతి), శ్రీ ఉ.వే. శేషు పరాశరం స్వామి (తిరువహీంద్రపురం),శ్రీ ఉ.వే. ఇ.ఎస్‌. ముకుందాచారియార్‌ స్వామి (హైదరాబాద్‌), శ్రీ ఉ.వే. శ్రీరామ్‌ జగన్నాధన్‌ స్వామి (చెన్నై) హాజరయ్యారు.
శ్రీ రంగనాధన్‌ స్వామి తన ప్రసంగంలో పరంపర సాధించిన విజయాలను చెబుతూ, భవిష్యత్తులో పరంపర ద్వారా నిర్వహించే కార్యక్రమాలను తెలియజేశారు. గత సంవత్సరం ధనుర్మాస మహోత్సవం పేరుతో నిర్వహించిన పోటీల్లో ఎంతోమంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభపాటవాలను ప్రదర్శించారని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం స్తోత్రపాఠాలను, దివ్య ప్రబంధాన్ని నేర్చుకుంటున్న వారికి కూడా ఓ పోటీలను నిర్వహిస్తున్నాము. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఓ సావనీర్‌ను కూడా వెలువరిస్తున్నాము. కంభరాజపురం మురళీ అయ్యంగార్‌ స్వామి రచించిన శ్రాద్ద పుస్తకంను, నిత్య ఆరాధన పుస్తకాలను కూడా వెలువరించనున్నామని చెప్పారు. అమూల్యమైన సేవలను అందిస్తున్న పరంపరను మరిన్ని కార్యక్రమాలను చేయడానికి వీలుగా ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.
తిరువహీంద్రపురంలోని శ్రీ హయగ్రీవస్వామి, శ్రీ దేవనాధన్‌ స్వామికి కైంకర్యం చేస్తున్న అర్చకస్వామి శ్రీ శేషు పరాశరం స్వామి మాట్లాడుతూ, పరంపర ప్రారంభోత్సవ సమయంలో మాట్లాడే అవకాశం, ఇప్పుడు వార్షికోత్సవ వేడుకల్లో కూడా మాట్లాడే అవకాశం లభించింది. పరంపర వెబ్‌సైట్‌ నాటి నుంచి ఈ సంవత్సరకాలంలో వైష్ణవులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలియజేసింది. పరంపర పరంపరమై వ్యాప్తి చెందాలని, శ్రీ వైష్ణవ ప్రచారంలో ముందుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
శ్రీ ముకుందాచారి స్వామి మాట్లాడుతూ, శ్రీ దేశికన్‌ స్వామి అనుగ్రహం, హయగ్రీవస్వామి అనుగ్రహంతో ఈ పరంపర వెయ్యేళ్ళపాటు సాగాలని మంగళాశాసనం చేస్తున్నాము.ఈ పరంపర వెబ్‌ సైట్‌ మరింతగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. సంప్రదాయ సంతతి వృద్ధి చెందాలని కోరుకుంటూ దేశికులవారు చెప్పిన స్తోత్రాన్ని ఉదహరించి పరంపర వెబ్‌ సైట్‌ మరింతగా వికసించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
శ్రీరామ్‌ జగన్నాధన్‌ స్వామి మాట్లాడుతూ, పరంపర వెబ్‌ సైట్‌లో ఇంగ్లీష్‌, తెలుగు, తమిళం భాషల్లో మంచి మంచి విషయాలను తెలియజేస్తున్నారు. ఆడియో, వీడియోలను కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెబుతూ, ఇంకా ఈ పరంపను మరింతగా వృద్ధి చెందాలని కోరుతున్నాము.
ప్రత్యేక అతిధి శ్రీ అనంత పద్మనాభచారియార్‌ మాట్లాడుతూ, మనం శ్రీ వైష్ణవ ప్రచారంలో టెక్నాలజీని మనం సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామని చెప్పారు. దుష్ప్రచారం ముందుకు దూసుకువెళ్ళినట్లుగా మంచి విషయాలు ముందుకు వెళ్ళడంలేదు. మనం టెక్నాలజీని ఇప్పుడైనా ఉపయోగించుకుని సరైన విషయాలను పాఠకులకు అందించాలని కోరుకుంటున్నాను. భయపడకుండా మంచి సంగతులను, యువతను వైష్ణవంపై ఆసక్తిని కలిగించేలా విషయాలను పరంపర ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ, పరంపర వెబ్‌ సైట్‌ వచ్చేసంవత్సరం జరుపుకునే వేడుక మరింత వైభవంగా జరగాలని కోరుకుంటున్నానని శ్రీ అనంత పద్మనాభ చారియార్‌ తెలియజేశారు.
శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి తన ప్రసంగంలో అహోబిలమఠం 44వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అళగియసింగర్‌ స్వామి ప్రవచనాలు, ఆదేశాలు తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆయన ఆదేశాలతోనే ఓ వ్యక్తిగా నేను అమెరికాలో దేవాలయాన్ని నిర్మించగలిగానంటే దానికి ఆచార్యులు ఇచ్చిన ఆదేశమే తనకు స్ఫూర్తిగా నిలిచి, తనను నడిపించిందని చెప్పారు. తెలుగువాళ్ళు కూడా దివ్య ప్రబంధాన్ని పఠించేలా చేయడంతోపాటు వారిలో భక్తిభావాన్ని నిలుపుకుంటున్నట్లు చెప్పారు. 4వేల దివ్యప్రబంధాలు నేడు అమెరికాలో నలుమూలలా ఉన్న తెలుగువాళ్ళు, తమిళులు పఠిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు భగవద్గీత, మంత్రరాజపదస్తోత్రం, లక్ష్మీ అష్టకం, శ్రీస్తుతి వంటి స్తోత్రాలను, పాదుకాసహస్త్రం వంటివి మహిళలు, పురుషులు చేస్తున్నారని చెప్పారు. శ్రీరంగనాధ స్వామి దేవాలయం నిర్వహణలో అన్నీ ఉచితమేనని చెప్పారు. అభిషేకం, ఇతర ఆర్జితసేవలన్నీ ఉచితమేనని చెప్పారు. ఆలయాల నిర్వహణ ఎంత కష్టమైనదో వివరించారు. వైష్ణవం అంటే ఇలా ఉండాలి, వైష్ణవ దేవాలయం ఎలా ఉండాలో అని చేసి చూపించమని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో శ్రీరంగనాధస్వామి ఆలయం ఏర్పాటైంది. ఆచార్యులవారి వాక్‌ శుద్ధికి ఎంత బలముందో ఈ ఆలయం ఏర్పాటే కారణమని చెప్పారు. అలాగే నేడు వైష్ణవ ధర్మాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. మంచి విషయాలను స్వామీజి ఎన్నో తెలియజేశారు.
చివరగా సతీష్‌ బుక్కపట్నం వందన సమర్పణ చేశారు. శ్రీధర్‌ స్వామి తొలుత పరంపర వెబ్‌ సైట్‌ సాధించిన విజయాలను, అతిధులను పరిచయం చేశారు.

https://www.youtube.com/watch?v=RChFBXmCdV4

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour