శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం మరియు నియమములు
మునిత్రయ సంప్రదాయం:
1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను.
2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి నైవేధ్యం సమర్పించిన తరువాత వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించ వచ్చును.
3. అదియు కానిచో పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయ వచ్చును.
4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించ కూడదు. మహా పాపము సంభవించును.
5. వ్రతనియమము పాటించ వలెను. ( గంధం, తాంబూలం , శిఖాలంకారము చేయగూడదు)
6. వ్రతానికి కావలసిన సంకల్పము చేసుకొన వలెను,
7. సాయంత్రపూట గృహమును శుభ్రపరచి ముగ్గులు మరియు చిన్ని కృష్ణుని పాదములు వేయవలెను,
8 రాత్రి పూట శ్రీ మధ్భాగవతం లోని శ్రీ కృష్ణావతార ఘట్టమును పారాయణం చేయవలెను.
9. అట్లు కానిచో వేరు ఏదైనా శ్రీ కృష్ణ స్త్రోత్రము పారాయణం చేయవచ్చును.
10. రాత్రి శ్రీజయంతి సంధర్భంగా స్నానమాచరించ వలెను.
11. మడి వస్త్రము ధరించి ద్వాదశ ఊర్ధ్వ పుండ్రం ధరించ వలెను.
12 – రాత్రి పూట వృషభ లగ్న మందు తిరువారాధనము చేయవలెను. ఇదే శ్రీ కృష్ణ స్వామి జన్మించిన లగ్నం
13. వృషభలగ్నం పంచాంగం చూసి చేయవలెను.
14. తిరు వారాధనం చేసి స్వామి తీర్ధం తీసుకాని ఇంటిలోని అందరికి ఇవ్వవలెను.
15. రాత్రిపూట జాగరణ చేయుట విశేషము.
16. మరుసటి రోజు ప్రొద్దున విశేష తిరువారాధనం . శ్రీ పాద తీర్ధం తీసుకొన వచ్చును.
17. ఆచార్య పాదుకారాధనం శుభప్రదం
18. పారణ నియమం విశేషం.
19. విశేష తిరువారాధనం కావున కధళీపంచకం అనగా అరటి పండు, అరటికాయ, అరిటాకు , అరటి పువ్వు అరటి బొంత వాడవచ్చును. వాడుకలో ఇది ద్వాదశి నాడు నిషిద్దం.
20. ఏది ఎమైనప్పటికి చింతపండు నిషిద్దం .
శ్రీమత్ అహాబిలమఠం :
ఆవణి నెల కృష్ణ పక్ష – అష్టమి రోహిణి చేరిన దినం శ్రీ జయన్తి . ఒక ఘడియ కూడా దోష ముండ రాదు . అలారాని చో మరుసటి రోజు నవమి శుద్ధమైన దినము, రోహిణి ఉండవలెను. అదియూ లేనిచో మృగశీరిష నక్షత్రముతో కూడిన నవమి లేక దశమి రోజు శ్రీ జయన్తి .
పారాయ ణం , స్నానం వృషభ లగ్న మందు తిరువారాధనము చేయవలెను. విశేష వ్రతం, అర్ఘ్యం లేదు. రాత్రి పూట పారణ కావున అలంకార తళిగై ప్రసాదం, పప్పు పాయసం, భక్షణ ములు మొదలగునవి నివేదించవలెను.
. తిరువారాధనం
1. తిరువారాధనం సంకల్ప మందు కృతంచ…. శ్రీజయంతి పుణ్యకాలే శ్రీ కృష్ణా రాధనాక్యేన భగవత్ కర్మణా భగవంతం వాసుదేవం అర్చయిష్యామి అని చెప్పవలెను.
2. మంత్రాసనము నందు లోకనాథస్య కృష్ణస్య జయన్తీ సముపాగతా అని చెప్పవలెను.
3. విశేషముగా గోక్షీరముతో అభిషేకం చేయవలెను
4. అలంకారాసనము నందు ధూపం, దీపం, సమర్పించిన తరువాత విశేషమైన అర్ఘ్యం ఒకటి సమర్పించ వలెను.
విశేష అర్ఘ్యం : –
1 – మూల మంత్రముతో ప్రాణాయామం .
2. సంకల్పం : శ్రీ కృష్ణ జయన్తీ ఉత్స వార్థం అర్ఘ్యం సమర్పయామి
3. ఒక శంఖములో కొబ్బరినీరు నింపి అర్ఘ్యం ఇవ్వవలెను.. శంఖము లేనిచో ఒక ఆకుతో సమర్పించ వలెను .
4. శంఖమును మూల మంత్రముతో ప్రోక్షణం చేయవలెను .
5. శంఖం అగ్రభాగమందు చంద్రం ఆవాహయామి అని చంద్రుని ఆవాహనం చేయవలెను , శంఖము చివర జనార్ధనం ఆవాహయామి అని పెరుమాళ్ళను ఆవాహనం చేయవలెను.
6. ఈ శంఖమునందు కొబ్బరి నీరు చేర్చి అందులో గంధం, పుష్పం అలంకరించ వలెను
7. మోకాళ్ళ మీద కూర్చోని చంద్రునికి, శ్రీ కృష్ణ భగవానునికి అర్ఘ్యం సమర్పించ వలెను
8. చంద్రునికి అర్ఘ్యం . మంత్రం : – క్షీరోదార్ణవ సమ్బూత అత్రి నేత్ర సమద్భవ గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహిత శశిన్
తరువాత చంద్రునికి ఉపస్థానం చేయ వలెను లేచి నిలబడి చేతులు జోడించి స్త్రోత్రం చేయవలెను.
మంత్రం : – జ్యోత్స్ననా పతే నమస్తుభ్యం నమస్తే జ్యోతి షాం పతే!
నమస్తే రోహిణీ కాన్త సుధా కుంభ నమోస్తుతే |
తరువాత శంఖము లో శుద్ధమైన నీరు నింపి గంధం, పుష్పము అలంకరించి మోకాళ్ళ మీద కూర్చోని శ్రీ కృష్ణ భగవానునికి అర్ఘ్యం సమర్పించ వలెను.
మంత్రం:
జాత: కంస వదార్థాయ భూభారొద్దర ణాయచ !
దానవానాం వినాశాయ దైత్యానాం నిదనా యచ!
పాండవానాం హితార్థాయ ధర్మస్థా పనాయచ !
యాద వానాం చ రక్షణార్ధం వసుదేవ కులోద్భవ !
గృహాణార్ఘ్యం మయాదత్తం దేవ క్యా సహితో హరే !!
5. తరువాత మంత్ర పుష్పం విశేష అర్చన, స్తోత్ర పారాయణం చేయవలెను.
6 – భోజ్యాసనము నందు అన్నివిద ములైన భక్ష్యములను , పెరుగు వెన్న నివేదించ వలెను .
7. పునర్ మంత్రాసనము నందు పండ్లు తాంబూలం సమర్పించ వలెను
8. విశేషమైన దీపహార్తి, వివేషమైన శాత్తుమొఱ చేయవలెను
9. ఇలాగా తిరువారాధనం ముగించ వలెను.
10. మరుసటి రోజు విశేషమైన తిరువారాధనం చేయవలెను. స్వామికి విశేషమైన తళిగై సమర్పించ వలెను.
Kambharajapuram Murali Iyengar, Tirupati