తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత
తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి తీర్థకైంకర్యం చేస్తున్న తిరుమలనంబికి, తిరువాడిప్పూరం ఉత్సవానికి ప్రత్యేక సంబంధం ఉంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న పాదాలమంటపం వద్ద తిరుమలనంబి భగవద్రామానుజులవారికి రామాయణ కాలక్షేపం నిర్వహించారని, ఈ రామాయణ కాలక్షేపం వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి సమయం లేకపోయిందని తిరుమలనంబి బాధపడుతున్న సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ మంటపంలోనే తిరుమలనంబికి సాక్షాత్కరించి ఆయన బాధను పోగొట్టారట.
తిరువాడిప్పూరం ఉత్సవసమయంలో ఈ పాదాలమంటపం వద్దకు శ్రీ గోవిందరాజ స్వామిని వేంచేయించి, తిరుమలనంబి వంశీయులకు మర్యాదను, అలాగే తిరుమలనంబి శిష్యులైన కైకాలరెడ్డి వంశీయులను టీటీడివారు సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. నిన్న జరిగిన తిరువాడిప్పూరం ఉత్సవంలో తిరుమలనంబి వంశీయులైన శ్రీ ఉ.వే. ముకుందన్ స్వామి ఈ మర్యాదను అందుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు చాలామంది ఈ పాదాలమండపం వద్ద శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాలను నేటికీ దర్శించుకుని తరిస్తూ ఉంటారు.