Paramparaa – The Tradition Continues…

ఇంటి నుంచే సంస్కృతి పరిరక్షణ జరగాలి…సుందర్‌ దిట్టకవి

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆచారవ్యవహారాలు ఎంతో గొప్పదన్న విషయాన్ని పాశ్చాత్య సమాజం ఏనాడో గుర్తించింది. ఎంతోమంది పాశ్చాత్యులు నేడు మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించేందుకు మక్కువ చూపుతున్నారు. అలాగే ఉపాధికోసం అమెరికాకు వెళ్ళిన ఎంతోమంది ముఖ్యంగా తెలుగువాళ్ళు తమ సంస్కృతీ, సంప్రదాయాలను మరచిపోకుండా పాటిస్తూ ఉన్నారు. అలాంటివారిలో చికాగోలో ఉన్న సుందర్‌ దిట్టకవి ఒకరు. గ్రేటర్‌ చికాగో తెలుగు అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేసి, చికాగో ఆంధ్ర అసోసియేషన్‌ వ్యవస్థాపకునిగా చైర్మన్‌గా నేడు పనిచేస్తున్నారు. అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా, చైర్మన్‌గా మన సంస్కృతిని తెలియజేసే ఎన్నో కార్యక్రమాలను చేయడంతోపాటు అందులో అందరినీ భాగస్వాములయ్యేలా చూస్తూ, మన సంస్కృతి వికాసానికి ఆయన కృషి చేస్తున్నారు. నమస్తే చికాగో రేడియో ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. సాంస్కృతిక సేవతోపాటు, సామాజికసేవలోనూ ఎంతో ముందుండే సుందర్‌ దిట్టకవి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకోసం చికాగోలో అన్నీ సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశారు. సంప్రదాయాలను మనం పాటించి చూపితేనే రేపటితరం కూడా పాటిస్తుందని ఇందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా సుందర్‌ దిట్టకవి పేర్కొంటున్నారు.

      మన సంస్కృతీ, సంప్రదాయాలపై సుందర్‌ దిట్టకవి రాసిన ఆర్టికల్‌ను యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాము.   సంప్రదాయాలను మనం పాటించి చూపితేనే రేపటితరం కూడా పాటిస్తుందని ఇందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా ఆయన తన ఆపేర్కొన్నారు.

గన్నవరం నుంచి అమెరికాదాకా…

 నా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కృష్ణా జిల్లా గన్నవరం నా మాతృ భూమికి మాతృ సంస్కృతికి  సదా నేను రుణపడి ఉంటాను.  1989లో ఉద్యోగ రీత్యా భారత రాజధాని ఢల్లీి నగరంలో కొన్ని సంవత్సరాలు నివసించినప్పుడు మొట్టమొదటిసారిగా మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గొప్పతనం వాటి భిన్నత్వం గమనించాను. మన వూరు మన పరిసరాలకి దూరంగా ఉన్నప్పుడు ఈ విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి అని నా అభిప్రాయం. ఏ సంస్కృతి ప్రత్యేకత దానికుంటుంది. అయితే తెలుగువారికి కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు, వేడుకలు, అలవాట్లు కళా ప్రదర్శనలు వున్నాయి. తెలుగు వారి సంప్రదాయాలు కూడా భారతీయ సంస్కృతిలో మిళితమైనప్పటికీ వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి. వాటిని కనుమరుగై పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను  భావిస్తాను. అందులో భాగంగానే నావంతు నేను ఏమీ చేయగలను అనే ఆలోచన నాలో మొదలైంది. ఇక్కడ ముఖ్య  విషయం సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటంతో పాటు వాటిని భావితరాలకు అందించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను. దాని ప్రభావంతో ఢల్లీిలో ఆనాటి తెలుగు సంఘాల కార్యక్రమాలలో పాలుపంచుకోవటంతో నా యాత్ర మొదలైంది. తెలుగు సాహిత్యం చదవడం, సాహిత్యగోష్ఠులతో పాల్గొనడం, తెలుగుభాష అభివృద్ధి, తెలుగు పండుగలు జరుపుకుంటూ వాటి గొప్పతనం మన చిన్నారులకి తెలియచెయ్యడం ఇలా ఎన్నో ప్రక్రియలు మన ఇంట్లోంచే మొదలుపెట్టొచ్చు అని గాఢంగా నమ్మి అవలంభించడం జరిగింది. ఆ తరువాత గుజరాత్‌ రాష్ట్రంలో అహమ్మదాబాదు నగరంలో కొంతకాలం నివసించినప్పుడు కూడా ఇదే తరహా జీవన విధానాన్ని అవలంబించాను.

1996వ సంవత్సరంలో అమెరికా దేశానికి వలస రావడం తద్వారా ఇక్కడే స్థిరపడి పోవటం జరిగింది. మొదట 2,3 సంవత్సరాలు ఉద్యోగం విషయంలోనూ కొత్త ప్రదేశంలో అలవాటు పడటంలో నిమగ్నమటం జరిగింది. మొట్ట మొదటిగా 1999వ సంవత్సరంలో చికాగో ప్రాంతపు తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో అనే సంస్థలో ఏక పాత్రాభినయంతో ఇక్కడి సాంస్కృతిక జగత్తులోకి ప్రవేశించటం జరిగింది. మనం ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలకి ఒక సందేశం ఇచ్చేదిగా ఉండాలనే ధృడమైన అభిప్రాయంతో మన సంస్కృతీ సంప్రదాయాలకు సరిపడేట్టు కార్యక్రమాలని రూపొందించడంలో అప్పటి అధ్యక్షులు వారి కార్యవర్గానికి నావంతు సహాయ సహకారాలు అందించాను. యువతకు అర్థమయ్యేలాగా కొన్ని నాటికలు రచించి, ప్రదర్శించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దేశబాషలందు తెలుగు లెస్సు, అమెరికాలో అమ్మాయి పెళ్లి, సినీ రాజకీయ చదరంగం వంటివి యువతని  ఆలోచింపచేయగా, చాదర్‌ఘాట్‌ మల్లేష్‌, గాడ్‌ బ్లెస్స్‌ అమెరికా, కష్టం రా సర్వీస్‌ లాంటి నాటికలు మన చుట్టు పక్కల జరుగుతున్నా విషయాలకి అద్దం పట్టేలా రాయడం జరిగింది. 2008వ సంవత్సరంలో ఆ అసోసియేషన్‌కి కార్యదర్శి గాను పిదవ 2011లో ఆ సంస్థ అధ్యక్షుడిగానూ పని చేసి భాషా సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందగలిగాను.

నమస్తే చికాగో రేడియో ద్వారా…

                బాల్యం నించి ఆకాశవాణి వింటూ పెరిగిన నేను చికాగో నగర తెలుగు వాసులను తెలుగు  రేడియో ద్వారా కలిపితే ఎలా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు అందులోనుంచి పుట్టిందే నమస్తే చికాగో రేడియో. ఆలోచన వచ్చిందే తడవుగా నమస్తే చికాగో రేడియోను ప్రారంభించి దాని ద్వారా ఎందరో పెద్దలను రేడియో ద్వారా శ్రోతలకు పరిచయం చేశారు. వీరిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, జయప్రకాష్‌ నారాయణ గారు, ఎందరో యువగాయక గాయకిమణులు. స్వయంగా రేడియో వ్యాఖ్యాతగా వుంటూ ఎందరో ఉత్సాహవంతులకి మా రేడియో ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చెయ్యడానికి  అవకాశం కలిపించగలిగాను. నాలోని ఒక చిరు గాయక తునక నన్ను సంగీత సంధ్య అనే ఒక సంస్థ తో పని చేసి ఘంటసాల మాస్టారి మధుర గీతాలు ఆలపించుతూ ఆ నాటి సాహిత్యపు. సంగీతపు విలువలు మా తరానికి, తరువాత తరానికి పరిచయం చేసేలా చేసింది.

చికాగో ఆంధ్ర అసోసియేషన్‌

ఇక 2016లో సంవత్సరంలో సంస్కృతీ సాంప్రదాయాలతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు ముఖ్య ధ్యేయంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్‌ స్థాపించి వ్యవస్థాపక  అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు పల్లె సంబరాలు, ఆంధ్ర సాంస్కృతిక దినోత్సవం, అరటి ఆకులలో వడ్డన, వనభోజనాలు వంటి కార్యక్రమాలతోపాటు సమాజఅభివృద్ధి పథకాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టాము. వాటిలో పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చి సాంకేతిక సహాయం చేయడం, సురక్షిత మంచినీరు, బాలికల సాకర్యార్థం మరుగుదొడ్ల ఏర్పాటు. యోగ్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ల ద్వారా ఆర్థిక సహాయం, మహిళా సాధికారతకు కుట్టు మిషన్‌ల పంపిణీ లాంటివి కొన్ని ఉదాహరణలు. కృష్ణా జిల్లాలో ఆశాజ్యోతి హాండీక్రాప్ట్స్‌ వెల్పేర్‌ సొసైటీలోని బాల బాలికలకు అన్నదాన కార్యక్రమము, వారి సర్జికల్‌ కరెక్షన్‌కు ఆర్థిక సహాయం వంటివి చికాగో ఆంధ్ర అసోసియేషన్‌ ద్వారా చేస్తున్నాము. కోవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో ఆంధ్రరాష్ట్రంలోని అర్చకులకి, సురభి కళాకారులకి, రోజు వారీ కూలీలకి ఆర్థిక సహాయం, ఆక్సిజన్‌ సిలిండెర్‌ల ఏర్పాటు, మాస్కులు, పిపిఈ కిట్లు వంటివి అందించటం జరిగింది. సమాజంలో అవసరమున్న వాళ్ళకి మనవంతు సహాయం ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో, అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా చేసి తీరాలని ప్రఘాఢంగా నమ్మే నేను ప్రతి నిమిషం ఇదే ఆలోచనా సరళిలో ఉండటం అలవాటు చేసుకున్నాను. సమాజంలో ఏ విధమైన వ్యత్యాసాలు వుండకూడదని చికాగో ఆంధ్ర అసోసియేషన్‌ స్థాపనలో కొన్ని విశిష్ట అంశాలని అమలు చేసాను. అందులో చెప్పుకోతగ్గవి, సగం డైరక్టర్‌ స్థానాలు మహిళలకి, యువతకి, సీనియర్‌లకి కొన్ని డైరక్టర్‌ స్థానాలు అదే విధంగా ప్రతి సంవత్సరం అధ్యక్షుని పదవి ఒక సంవత్సరం పురుషుడు అయితే తర్వాత సంవత్సరం మహిళకి రిజర్వ్‌ చెయ్యటం దీని ద్వారా యువత భావితరాలకి సంస్కృతి రాయబారులు అయ్యే అవకాశం కలిపించాను.

2020 వ సంవత్సరం నుండి చికాగో ఆంధ్ర అసోసియేషన్‌ కి చైర్మన్‌ గా పదవి బాధ్యతలు స్వీకరించి, అధ్యక్షునిగా బోర్డు సభ్యులకు మార్గదర్శకం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాను.

తెలుగుభాష అభివృద్ధికి…

 ఇక తెలుగు భాష పరిరక్షణ అభివృద్ధికి, చికాగో సాహితి మిత్రులు అనే సంస్థతో కలిసి కవి సమ్మేళనాలు, రచయితలు, రచయిత్రుల అభినందన కార్యక్రమాలు నిర్వహణ, సిలికానాంధ్ర వారితో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం. ఒకసారి శ్రీ గరికిపాటి నరసింహారావుగారి అష్టావధానంలోను, ఇంకొకసారి శ్రీ నరాల రామిరెడ్డి గారి అష్టావధానంలోను, పృచ్ఛకుడిగా పాల్గొనగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రవాణి అంతర్జాల పత్రిక ద్వారా తెలుగు భాషలో కవితలు, కథానికలు, నాటికలు, ప్రసంగాలు, సమీక్షలు వ్రాయడానికి ఇక్కడి తెలుగు వారిని ప్రోత్సహించాను. ఇక్కడ ప్రాంతీయ గ్రంథాలయాలలో తెలుగు విభాగం స్థాపింపచేయడానికి నావంతు కృషి చేస్తున్నాను. త్వరలోనే నేపర్విల్‌ గ్రంధాలయంలో తెలుగు భాష పుస్తకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. భాష అనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి అని ప్రతి ఒక్కరికి తమ పిల్లలతో ఇంటిలో కేవలం తెలుగులోనే మాట్లాడే విధంగా ప్రభావితం చెయ్యటం దిన చర్య అయిపోయింది. అందువల్లే నా కుమార్తె కుమారుడు చక్కని తెలుగు మాట్లాడడమే కాకుండా కొద్దీ కొద్దీగా తెలుగు చదవగలిగేలా చెయ్యగలగటం నేను నా శ్రీమతి అఖండ విజయంగా భావిస్తాము.

                ఆన్‌లైన్‌ టోరీ రేడియో వ్యాఖ్యాతగా 2011 సంవత్సరం నుంచి ప్రతి బుధవారం కబుర్లతో కాసేపు అని ఒక కార్యక్రమంతో తెలుగు భాష, భావాలు, అనుభావాలు చర్చించుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శ్రోతలకు ఆత్మీయుడనవడం నాకు జీవితంలో ఎంతో సంతృప్తి నిచ్చిన కొన్ని విషయాలలో ఒకటి. ఇక కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వాలంటీర్‌ గా పనిచేస్తూ దేవాలయం  యాజమాన్యానికి, భక్తులకి సహాయ పడగలుగుతున్నాను.  

సర్వే జన సుఖినోభవంతు.

సుందర్‌ దిట్టకవి

చైర్మన్‌, చికాగో ఆంధ్ర అసోసియేషన్‌