అమెరికాలో ఉంటున్న అహోబిలమఠం శిష్యులు సెప్టెంబర్ 4,5 తేదీల్లో హ్యూస్టన్లో ఏర్పాటు చేసిన ఆచార్య డే ఉత్సవం వైభవంగా జరగాలని ఆశీర్వదిస్తూ అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆడియో ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. ఆచార్యుల వారి గొప్పదనాన్ని ఈ సందర్భంగా తమ అనుగ్రహ భాషణంలో పేర్కొంటూ, మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చేందుకు, అంటే సక్రమమైన మార్గంలో భగవంతుడి అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో తెలియజేసే వ్యక్తి ఆచార్యులవారని అంటూ, అటువంటి ఆచార్యులను ఆరాధిస్తూ జరిపే ఉత్సవాలు అందరికీ మంచిని కలుగజేస్తాయని ఆశీర్వదించారు. ఆచార్యులు అంటే చీకటి అనే అజ్ఞాన అంధకారం నుంచి మనల్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసే వ్యక్తిగా పేర్కొంటారు.
అందరూ బాగుండాలని, అందరి శ్రేయస్సుకోసం, హితంకోసం భగవంతుడిని ప్రార్థించే ఆచార్యుని సేవించాలని మన పెద్దలు చెబుతుంటారు. వేదంలో కూడా ‘ఆచార్య దేవో భవ’ అని ఉంది. వేదం కూడా ఆచార్యునికి గౌరవమైన స్థానాన్ని ఇచ్చింది. ఆచార్యుని కన్నా గొప్పవాళ్ళు లేరని కూడా చెబుతోంది. చీకటి అనే అజ్ఞానం నుంచి మనల్ని వెలుగులోకి తీసుకువచ్చేవారే ఆచార్యులు. భగవంతుడిని ఎలా సేవించాలి, దానికి సులువైన మార్గాన్ని చూపడంతోపాటు వాటిని అనుసరించాల్సిందిగా బోధనలతో మనలోని అజ్ఞానాన్ని తొలగించేవాడు ఆచార్యుడు.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ:
అజ్ఞానమను చీకటిని తొలగించడం కోసం జ్ఞానమనే ‘అంజనాన్ని’ మనకిచ్చే గురువుకు నమస్కారాలు అందజేస్తూంటాము కదా!
అందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ ఆచార్య డే వేడుకలు మరింత బాగా జరగాలని ఆశీర్వదిస్తున్నానని అహోబిలమఠం పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణలో పేర్కొన్నారు.