కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది. ఈ దేశికులవారి ఆలయ చరిత్ర చూస్తే 1887లోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. నెల్లూరు పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఎదురుగా కేవలం వందగజాల దూరంలో శ్రీ వేదాంతదేశికుల వారి ఆలయం కనిపిస్తుంది. అలాగే శ్రీ ఆదివణ్ శఠకోప యతీర్రద మహాదేశికులవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఆలయంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుట్లో అహోబిలమఠం వారు ఆలయ నిర్మాణంకోసం ఈ ప్రాంతాన్ని విరాళంగా ఇచ్చారు. దాంతో భక్తులంతా కలిసి 1887 ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
శ్రీ వేదాంత దేశికులవారి 750వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వరుని ఘంటావతారంగా కొనియాడే శ్రీ వేదాంతదేశికులను ఘంటా రూపంలో ప్రతిష్టించారు. దాదాపు ఐదు టన్నుల బరువు ఉన్న ఘంటామూర్తి అందరినీ ఆకట్టుకుంటూ, భక్తుల పూజలను అందుకుంటున్నారు.
6 నుంచి 16 వరకు ఉత్సవాలు
శ్రీ వేదాంత దేశికులవారికి ప్రతి ఏటా తమిళనెల పురటాశి మాసంలో వేదాంతదేశికులవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ మాసంలోనే శ్రీ ఆదివణ్ శఠకోప యతీర్రద మహాదేశికుల వారికి కూడా ఉత్సవాలను జరుపుతారు.
ఈనెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీ వేదాంతదేశికులవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. 6వ తేదీన హంసవాహనం, 7వ తేదీన సింహవాహనం, 8వ తేదీన వ్యాళి వాహనం, 9వ తేదీన వేంకటనాయకి అలంకారం, 10వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి గరుడవాహనం, 11వ తేదీన యతి సార్వభౌమ శ్రీమద్ ఆదివణ్ శఠకోప యతీంద్ర మహాదేశికులవారి అవతార తిరునక్షత్ర ఉత్సవం, 12వ తేదీన చంద్రప్రభ, 13వ తేదీన గజవాహనం, 14న అశ్వవాహనం, 15న ఆచార్య సార్వభౌమ తూప్పుల్ శ్రీమాన్ నిగమాంత మహాదేశికులవారి అవతార తిరునక్షత్ర మహోత్సవం, 16వ తేదీన గంధపొడి ఉత్సవం జరుగుతుంది.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని వైభవంగా అలంకరించారు. ప్రతిరోజు వేద, దివ్య ప్రబంధ పారాయణాలతో స్వామివారి ఉత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.