శ్రీ వైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు, సనాతన ధర్మ మార్గాలను శిష్యులకు బోధించేందుకు ఏర్పడిన పౌండరీకపురం ఆశ్రమం నేటి ఆధునిక కాలంలో కూడా సంప్రదాయ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. పౌండరీకాపురం ఆశ్రమంలోని సదాచార్యులు సన్యాస ధర్మాన్ని పాటించడంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. విలక్షణమైన వైరాగ్యం, సదాచార సంపత్తి ఈ ఆచార్య పరంపరలోని అందరికీ ఒక ముఖ్య లక్షణం. అందువల్ల, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారందరూ ఈ ఆశ్రమాన్ని అత్యంత ఉన్నతమైనదిగా భావిస్తారు. సంపద, భూమి మొదలైన విషయాలలో ఈ సదాచార్యులు ఎల్లప్పుడూ సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఇటువంటి కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఉన్నతమైన భక్తి మరియు సంప్రదాయం పట్ల అత్యున్నత అంకితభావం శిష్యులలో అభిమానులలో విలువలను పెంపొందించడానికి ఇది దోహదపడింది. అత్యంత కఠినమైన ఆత్మనిగ్రహాన్ని పాటిస్తున్నప్పటికీ, ఈ సదాచార్యులు అపారమైన కరుణను, సహనాన్ని, అందరి పట్ల గొప్ప ప్రేమను ప్రదర్శించారు. చివరకు జంతువులకు కూడా
వారు మోక్షాన్ని ప్రసాదించారు. చాలా కాలంగా తనను అనుసరిస్తున్న ఒక నల్ల నాగుపాముకు వేదాంత రామానుజ మహాదేశికన్ (వళుత్తూరు అండవన్) ప్రపత్తి చేసి మోక్షం ఇవ్వడం వీరి కారుణ్యానికి నిదర్శనం. అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న ఎందరికో ఈ ఆశ్రమం స్వాంతనను, ఉపశమనాన్ని అందించింది. ప్రపత్తి, ప్రాయశ్చిత్తం చేయడానికి కరుణించి, తద్వారా ఎన్నో జీవాత్మలను ఈ పీఠాధిపతులు భగవంతుడి చరణములలో సమర్పించారు. ఈ ఆశ్రమ పీఠాధిపతుల్లో ఒకరైన శ్రీమద్ గోపాల దేశిక మహాదేశికన్ తమిళంలో రాసిన రామాయణం ‘రామపిరానై కర్పోమ’ గ్రంథం అపురూపమైనది. ప్రస్తుత పీఠాధిపతి శ్రీమద్ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి ప్రశాంతమైన మరియు అత్యంత సౌమ్యమైన స్వభావం కలవారు. అపారమైన ఆధ్యాత్మిక శక్తి, తేజస్సుతో శిష్యులను కరుణిస్తున్నారు. వివిధ దివ్యదేశాలలో పర్యటించి భక్తులకు వివిధ సంప్రదాయ గ్రంథాల సారాంశాలను తెలియజేస్తున్నారు. స్వామివారి షష్ట్యబ్దిపూర్తి మీVAత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము. నా మిత్రుడు శ్రీమాన్ తట్టై గోవిందరాజన్ ఈ పుస్తక రూపకల్పనలో సహకారాన్ని అందించినందుకు ధన్యవాదములు. ఈ పుస్తక ప్రచురణకు సహకరించిన హైదరాబాద్‌లోని అమర్నాథ్ వారికి, ఇతరులకు కూడా అభినందనములు.
ఉ.వే. చక్రవర్తి రంగనాధన్
డీన్, సాహిత్య, సంస్కృతి విభాగం, డైరెక్టర్ (దూరవిద్యాలయం)
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి.



