కవితార్కిక సింహులు, భగవంతుడిని సులభంగా సేవించే అవకాశాన్ని తన రచనల ద్వారా కల్పించిన శ్రీ వేదాంత దేశికులవారికి అనునిత్యం సేవలందించి కీర్తిగడిరచిన శ్రీమాన్ నడాదూరు కేశవాచార్యులు సేవలు నేటితరానికి స్ఫూర్తిదాయకం. నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం కార్యనిర్వహణాధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు దేశిక సంప్రదాయ విస్తరణకు ఆయన చేసిన కృషి ఎనలేనివి. ప్రతినిత్యం శ్రీమన్నారాయణ మంత్రపారాయణతో, శ్రీరామానుజ నామ మననంతో, శ్రీ వేదాంత దేశిక స్తోత్ర పఠనంతో ఎల్లప్పుడూ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రతిరూపంగా నిలవడంతోపాటు దేశిక సంప్రదాయ విస్తరణలో అందరినీ పాలుపంచుకునేలా చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. తిరునక్షత్ర మహోత్సవాలను, ఇతర ఉత్సవాలను నిర్వహించడంలో ఆయనకు ఉన్న అంకితభావం, శ్రద్ధ వల్లే నేడు ఎంతోమంది శ్రీ దేశికులవారి సేవలో పాల్గొంటున్నారు. శ్రీ వేదాంత దేశికుల దేవాలయమే సర్వస్వం అనుకుంటూ ఆయన సేవ చేసేవారు. ఆయన చేసిన సేవలను చూసి ఎంతోమంది ఈ దేవాలయాన్ని కేశవాచారి కోవిల్‌గా పేర్కొనేవారంటే ఆయన దేవాలయానికి ఎలాంటి సేవలందించారో అర్థమవుతుంది. వెల్లూరు వెంకటగిరి రాజా వారి కళాశాలలో వాణిజ్యశాఖ అధ్యక్షులుగా ఉంటూ అటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంచి పేరు గడిరచారు. మరోవైపు మన సంప్రదాయాన్ని విస్మరించకుండా దేవస్థాన నిర్వహణయే పరమావధిగా భావించి సన్నిధి సంరక్షణకై అనునిత్యం శ్రమించి ఎంతోమంది భక్తులను సన్నిధి శిష్యులుగా తయారు చేశారు.
శ్రీ వేదాంత దేశికుల గురువు శ్రీమాన్ నడాదూరు అమ్మాళ్ (వరదాచార్యులు) వారి వంశంలో జన్మించి, తండ్రి శ్రీమాన్ నడాదూరు కృష్ణమాచార్యులు వారి సేవ, భక్తిని వారసత్వంగా స్వీకరించి దేశిక భక్తాగ్రేసరులుగా అందరి మన్ననలను అందుకున్న శ్రీమాన్ నడాదూరు కేశవాచార్యులు చిరస్మరణీయులు. ఆయన వారసత్వాన్ని శ్రీమాన్ నడాదూరు నరసింహాచార్యులు, శ్రీమాన్ నడాదూరు కృష్ణమాచార్యుల నుంచి నేటి ఏడవతరం వంశీయులు కూడా శ్రీ దేశిక సంప్రదాయాన్ని వైభవంగా విస్తరించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు.
శ్రీ నడాదూరు కేశవాచార్యులు నెల్లూరు శ్రీవేదాంత దేశిక దేవస్థానానికి చేసిన సేవలను స్మరించుకుంటూ వారి మార్గంలోనే నేడు శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం ట్రస్టీలుగా ఉన్న కడాంబి చెల్లస్వామి వరదరాజన్ (జనా), కడాంబి రామదొరై తదితరులు శ్రీ దేశిక సంప్రదాయాన్ని విస్తరించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు.