ఆచార్యులవారి నిత్యకార్యక్రమాలు
శ్రీమతే భాష్యకారాయ నమః
శ్రీమతే నిగమాంత మహా దేశికాయ నమః
శ్రీమతే శ్రీనివాస మహా దేశికాయ నమః
శ్రీమతే గోపాల దేశిక మహా దేశికాయ నమః
శ్రీమతే శ్రీనివాసగోపాల మహా దేశికాయ నమః
నిగమాంత మహాదేశికులు న్యాసవింశతిలో ఆచార్య లక్షణాలను వర్ణిస్తూ…
సిద్ధం సత్సంప్రదాయే స్థిర ధియం అనఘం శ్రోత్రియం బ్రహ్మ నిష్ఠమ్
సత్వస్థం సత్య వాచం సమయ నియతయా సాధు వృత్యా సమేతం
డంబాసూయాది ముక్తం జిత విషయ గణం దీర్ఘ బంధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహిత పరం దేశికం భూష్ణురీప్సేత్
అని పదనాలుగు గుణాలను చెప్పారు. ఈ లక్షణాలు అన్ని పూర్తిగా ఉన్న మన పరవాకోటై చిన్న ఆండవన్ స్వామి శ్రీనివాస గోపాల మహాదేశికన్ లో మనము చూడవచ్చు. స్వామి యొక్క దినచర్య ఎన్నో అనుష్ఠానములతో కూడి ఉంటుంది. ఆహ్నికములలో చెప్పినట్లుగా పంచకాల పరాయణులై వారు ఉన్నారు. తెల్లవారు ఉషః కాలములో స్వామి “హరి హరి” అని హరినామ సంకీర్తనమును ఏడు సార్లు చేసి శ్లోక త్రయమును, పరమార్థ శ్లోక ద్వయమును, పరత్వాది పంచకమును అనుసంధానం చేస్తారు. పిదప కాలకృత్యాలు శాస్త్రోక్తంగా ముగించుకొని శ్రీరంగంలో ఉంటే కొల్లిడం, కావేరి నదులలో; ఇతర క్షేత్రములలో ఆయా పుణ్య నదులు, పుణ్య తీర్థాలలో స్థానానికి తగినట్లు స్నానం చేస్తారు. స్నానం ముగించుకుని వస్త్రధారణ చేసి పూర్వాచార్యుల తనియన్ లను, స్తోత్రములు అనుసంధించుకుంటూ ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములను ధరిస్తారు. తరువాత సకాలంలో సంధ్యావందనం చేసి పూర్వాచార్యుల ద్వారా ఉపదేశం పొందిన మంత్రములను జపిస్తారు.
ఆ తరువాత పెరుమాళ్ళ సన్నిధికి వేంచేసి సుప్రభాతం పాడి కవాటములను తెరిచి మేలుకొలుపు చేస్తారు. ఆ తరువాత పెరుమాళ్లకు అలంకారం గావించి విశ్వరూప హారతి చేస్తారు. దీనిలో భాగంగా నిత్యం గోపూజ జరుగుతుంది. ఆ తరువాత అభిగమన ఆరాధన ప్రారంభించి, ఈ సమయంలోనే దివ్య ప్రబంధ వేద పారాయణములను చేస్తారు. దీని తరువాత నైవేద్యం చేసి మంగళహారతి, శాత్తుమురై జరుగుతుంది. తీర్థ గోష్టి సమయంలో వేదాంతదేశికుల మంగళంతో ప్రారంభించి ఆచార్యుల తనియన్లు, ఆచార్య వాక్య గురుపరంపరను అనుసంధిస్తారు. అభిగమన ఆరాధన ముగించిన తరువాత స్వామి అందరినీ ఆశీర్వదించి మంత్రాక్షతలను అనుగ్రహిస్తారు. ఆ తరువాత భక్తులు ఎవరైనా ప్రార్థిస్తే వారికి సమాశ్రయణ, భరన్యాస సంస్కారములను చేస్తారు. స్వామివారికి ఎంతోమంది గొప్ప మంత్రి సిద్ధి కలిగిన ఆచార్యుల నుండి మంత్రోపదేశం పొందారు. ఆ మంత్రాలను కూడా స్వామి ఉపదేశం చేస్తారు వాటి గురించి భక్తులకు వివరంగా అర్థం తెలిసేటట్లుగా చెప్పి ఎందుకు జపం చేయాలనేది కూడా బోధిస్తారు.
పై కార్యక్రమాలు ముగించుకుని స్వామి వారు అశ్రమ దైనందిన లావాదేవీలను, విశేష సూచనలను ఆశ్రమ సిబ్బందికి అందిస్తారు.
ఇజ్యాకాలంలో స్వామివారు తిరువారాధన గావించి అంతర్యామి నివేదన చేస్తారు (అంటే భోజనాన్ని స్వీకరిస్తారు).
పిదప గ్రంథ పారాయణములు, శ్రీ కోశములను కటాక్షించడం, ఇతిహాస పురాణములను సేవించడం వంటివి చేస్తారు.
సాయంత్రం సంధ్యావందనం చేసి ఆచార్యుల శ్రీ సూక్తులను అనుసంధిస్తారు. గోశాల, ఆశ్రమ పర్యావరణం ఎలా ఉందో పర్యవేక్షిస్తారు.
రాత్రి భగవధ్యాన సోపానాన్ని, శ్రీ వైకుంఠ గద్యాన్ని నెమరు వేసుకుంటూ యోగం చేస్తారు (అంటే నిద్ర గావిస్తారు).
పయ్యంబాడి శ్రీనివాసవరదన్



