.శ్రీమద్ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి
ప్రస్తుతం ఆశ్రమ 10వ పీఠాధిపతిగా శ్రీ పరవాక్కోట్టై చిన్న ఆండవన్ (శ్రీమద్ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2018లో పీఠారోహణ చేసిన వీరు, అతి స్వల్ప కాలంలోనే భారతదేశం అంతటా పర్యటించి 60కి పైగా దివ్యదేశాలను దర్శించి మంగళాశాసనాలు చేశారు. ఇటీవల వీరు హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో పర్యటించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. మరోవైపు శ్రీవైష్ణవ ధర్మాన్ని, సంప్రదాయ విలువలను భావి తరాలకు అందించడంలో పౌండరీకపురం ఆశ్రమం కృషిని విస్తృతం చేయాలన్న సంకల్పంతో ఎన్నో చోట్ల వీరు రామాయణం, తిరుప్పావై, ఇతర విషయాలపై ఉపన్యాసం చేస్తూ ప్రఖ్యాతి పొందారు.
ఈ ఆశ్రమానికి అత్యంత విశిష్టమైన సేవలు అందించిన శ్రీమద్ పరవాకోట్టై ఆండవన్ (శ్రీ గోపాల మహదేశికన్ స్వామి) వారు 2011లో పరమపదించిన తర్వాత, శ్రీమద్ శ్రీనివాస గోపాల మహదేశికన్ స్వామి వారు పీఠ బాధ్యతలను చేపట్టారు. వీరు మునిత్రయ సంప్రదాయంలోని నియమాలను, ఆచారాలను కచ్చితంగా పాటిస్తూ ఆశ్రమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ, శాస్త్రోక్తంగా నిత్య అనుష్ఠానాలను, భగవద్ ఆరాధనను ప్రతిరోజు నిర్వహించడంతోపాటు భక్తులకు సమాశ్రయణం (పంచ సంస్కారం) మరియు భరన్యాసం (ప్రపత్తి) అనుగ్రహిస్తున్నారు. మరోవైపు సంప్రదాయ గ్రంథాలైన శ్రీభాష్యం, భగవద్విషయం మరియు స్వామి దేశికుల ప్రబంధాలపై ప్రవచనాలు చేస్తున్నారు. శ్రీరంగంలోని ఆశ్రమ ప్రధాన కేంద్రం నుండి వీరు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అలాగే వేదాలను నేటితరానికి అందించాలన్న ఉద్దేశ్యంతో ఆశ్రమ పరిధిలోని వేద పాఠశాలల ద్వారా వేద విద్యను నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయ జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడంలో స్వామివారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ దివ్యదేశాలను సందర్శిస్తూ, ఆయా ప్రాంతాల్లోని శిష్యులకు మంత్రోపదేశం మరియు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేస్తున్నారు.
నేటితరాన్ని భక్తిమార్గంవైపు పయనింపజేయడంతోపాటు అందరికీ భగవంతుని మీద విశ్వాసాన్ని పెంచేలా ప్రవచనాలు చేస్తూ, మరోవైపు ఆచార్యుల సిద్ధాంతాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి వారు విశేషంగా కృషి చేస్తున్నారు.
`గోవిందరాజన్



