గల్ఫ్ దేశాల్లో ఎంతోమంది భారతీయలు ఉంటున్నారు. అందులో తెలుగువాళ్ళ సంఖ్య కూడా బాగా ఎక్కువే. ముఖ్యంగా దుబాయ్‌లో ఎంతోమంది తెలుగువాళ్ళు వివిధ కంపెనీల్లో, వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మాడభూషి విమల, రంగాచారి కుమారుడు విష్ణువర్ధన్ హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన తరువాత కంప్యూటర్ రంగంపై పట్టు సాధించిన తరువాత 1991లో మస్కట్‌లో ఉద్యోగనిమిత్తం వెళ్ళారు. అక్కడ ప్రముఖ కంపెనీగా పేరు పొందిన భవాన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. అక్కడ కొద్దిసంవత్సరాలు పనిచేసిన తరువాత కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఇంగ్లాండ్‌లోని నోవెల్ సంస్థలో కంప్యూటర్ రంగంలో మరింత శిక్షణను పొందారు. కంప్యూటర్ 2000 అనే బహుళజాతి సంస్థ ఆయనను తన కంపెనీలో మేనెజర్‌గా నియమించింది. తరువాత అదే కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరయ్యారు. ఆ కంపెనీ తరువాత టెక్‌డాటా కార్పొరేషన్‌గా మారింది. విష్ణువర్ధన్ ఇంగ్లాండ్, జర్మనీ, స్పెయిన్, ఫిన్‌లాండ్ వంటి దేశాల్లో కంపెనీ తరపున కార్యకలాపాలను నిర్వహించారు. వ్యాపార వ్యవహారాల్లో మంచి శిక్షణను ఇవ్వడంలో పేరు పొందిన విష్ణువర్థన్‌కు సంప్రదాయంపై కూడా మంచి ఆసక్తి ఉంది. దుబాయ్‌లో ఉన్నా మన సంస్కృతి, మన భాషను మరచిపోకుండా కార్యక్రమాలను చేస్తుంటారు. ఇతరులు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇంట్లో భగవంతుని ఆరాధన, పండుగలు ఇతర సమయాల్లో మన ఆచారవ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడంతోపాటు పిల్లలకు కూడా మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించేలా తయారు చేశారు.