పితామహస్యాపి పితామహాయ ప్రాచేతదేశ ఫలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్
తిరుమలక్షేత్ర ప్రథమపౌరుడిగా ఆచార్య పురుష అగ్రగణ్యుడిగా పేరొందిన శ్రీశైలపూర్ణులు అనే తిరుమల నంబి భగవద్రామానుజాచార్యులవారికి సాక్షాత్తు మేనమామ. శ్రీవారికి దాదాపు 1020 సంవత్సరాలముందు తీర్థ కైంకర్యం, పుష్పకైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కైంకర్యాలను నిర్వహించిన మహనీయులు. అందుకే తిరుమల పేరు చెప్పినపుడు తిరుమలనంబి గుర్తుకువస్తారు. అదే విధంగా తిరుమలనంబి పేరు చెప్పినపుడు తిరుమలక్షేత్రం గుర్తుకు వస్తుంది. అట్టి అవినాభావ సంబంధం తిరుమలకి తిరుమలనంబికి ఉన్నది. తిరుమలనంబి అవతారోత్సవాలను ఆగస్టు 31వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమలనంబి ట్రస్ట్ ఆధ్వర్యంలో, టీటీడి సహకారంతో నిర్వహించే ఈ అవతారోత్సవాలలో పలువురు పండితులు పాల్గొని ప్రవచనాలు చేయనున్నారు.
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండే తిరుమలలో స్వామివారి సేవలోనే తరించిన మహనీయులు తిరుమల నంబి. తిరుమల క్షేత్రంలో నివసించిన ప్రప్రథమ ఆచార్యుడిగా తిరుమల నంబిని పేర్కొనవచ్చు. 12 మంది ఆళ్వారులు భగవంతునిపై పాడిన నాలాయిర దివ్యప్రబంధ పాశురాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఆచార్యులు శ్రీమన్నాథమునులు. ఆయన మనవడు అయిన ఆళవందార్ల(యామునాచార్యుల)కు తిరుమల నంబి మనవడు. తిరుమల నంబి క్రీ.శ. 973లో తమిళ శ్రీముఖ సంవత్సరం పురట్టాసి నెలలో అనూరాధ నక్షత్రంలో జన్మించారు. తిరుమల నంబి తన జీవితాన్ని స్వామిసేవకే అంకితం చేశారు.
తిరుమలనంబి అవతారోత్సవాలను ఆగస్టు 31వ తేదీన ఆదివారంనాడు తిరుమలలోని దక్షిణమాడవీధిలో ఉన్న తిరుమలనంబి సన్నిధిలో నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 9.30 నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీశైలపూర్ణ శతకం తరువాత టీటీడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్, హిందూ ధార్మిక్ ప్రాజెక్టు ప్రోగ్రామ్ ఆఫీసర్ కె. రాజగోపాలరావు అందరికీ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్ళపల్లి శ్రీరామ కృష్ణమూర్తి ప్రధాన వక్తగా ప్రసంగం చేయనున్నారు. టి.కె. శేషాద్రి ధన్యవాదాలను తెలుపుతారు.
ఈరోజు కార్యక్రమంలో భాగంగా పలువిషయాలపై పలువురు పండితులు ప్రవచనం చేయనున్నారు. శ్రీ ఉ.వే. కన్నియంబాక్కం దేవనథాచారియార్ స్వామి, శ్రీ ఉ.వే. తిరుమలశంఖాపురం నారాయణాచారియార్ స్వామి, శ్రీ ఉ.వే. నావల్పాకం వాసుదేవచారియార్ స్వామి, శ్రీ ఉ.వే. ఓయపక్కం విజయరాఘవాచారియార్ స్వామి, శ్రీ ఉ.వే. లక్ష్మీ కుమారాచారియార్ స్వామి, శ్రీ ఉ.వే. మురారి భట్టర్ స్వామి, శ్రీ ఉ.వే. ఎం.ఎస్. శ్రీకాంత్ స్వామి, శ్రీ ఉ.వే. కెటివి రాఘవన్ స్వామి, శ్రీ ఉ.వే. అన్నదూర్ శేషాద్రి స్వామి, శ్రీ ఉ.వే. చక్రవర్తి రాఘవాచారియార్ స్వామి, శ్రీ ఉ.వే. తట్టై ప్రసన్న వెంకటేశన్ స్వామి, శ్రీ ఉ.వే. తళ్లం సంతానం స్వామి, శ్రీ ఉ.వే. తిరుప్పుకుజి శ్రీశైలతాతాచార్య స్వామి, శ్రీ ఉ.వే. వీరాపురం రామానుజన్ స్వామి, శ్రీ ఉ.వే. శ్రీనివాసవరదన్ స్వామి, శ్రీ ఉ.వే. ఆర్. సుధన్వన్ స్వామి ఈ కార్యక్రమాల్లో ప్రవచనం చేయనున్నారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.



